Reading Time: < 1 minute

రామంతపూర్ వాసవి నగర్ లో పట్ట పగలు జరిగిన దొంగతనం కేసులో పురోగతి లభించింది. అప్రమత్తమైన పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే కేసును చేదించి దొంగను పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ. 14.35 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఉప్పల్ జోన్ పరిధిలోని రామంతపూర్ వాసవీ నగర్‌లో నివసిస్తున్న గుంటి మల్లమ్మ నివాసంలో ఫిబ్రవరి 5న ఉదయం 6 గంటల నుంచి 11-30 గంటల మధ్య ఈ చోరీ జరిగింది. అజ్ఞాత వ్యక్తి అల్మారాను పగలగొట్టి ఇంట్లో ఉన్న 85 గ్రాముల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి వస్తువులను అపహరించాడు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్లు 331(3), 305(ఎ) కింద క్రైమ్ నెంబర్ 180/2026గా ఉప్పల్ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామంతపూర్ వాసవీ నగర్‌కు చెందిన తాళ్ల రాఘవేందర్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్ అలియాస్ డక్కలి రమేష్ అలియాస్ శ్రీను (36)గా నిందితుడిని గుర్తించారు. నిందితుడు గతంలో కూడా షాబాద్, షాద్నగర్ నార్సింగి, అంబర్ పేట్ ప్రాంతాల్లో ఇలాంటి ఇంటి చోరీ కేసుల్లో నిందితుడుగా అరెస్టు, అనంతరం జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 6న సాయంత్రం 6 గంటలకు అతని నివాసంలో పోలీసులు అరెస్టు చేసి చోరీ చేసిన మొత్తం బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన ఉప్పల్ పోలీసుల పనితీరుపై ఏసిపి వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు.