Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో కబ్జాలే తప్ప అభివృద్ధి లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కబ్జాలతో కరీంనగర్ లో సగం మంది కార్పొరేటర్లు జైలు కెళ్లారని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలచ్చిన కాంగ్రెస్ అమలు చేయట్లేదని, పదే పదే ఢిల్లీ వెళ్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లకు డబ్బులిస్తారా? అని కాంగ్రెస్ కు ఓటేస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంటి పన్ను, నల్లా పన్ను కరెంట్ ఛార్జీలను పెంచుతారని ధ్వజమెత్తారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను కేంద్రమే ఇస్తోందని, బిజెపికి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి మరిన్ని నిధులు వస్తాయని తెలియజేశారు. నిధులు లేవంటున్నారు కాబట్టి.. కాంగ్రెస్ కు ఓటు వేసినా నిధులు రావు అని అన్నారు. బూటకపు హామీలు నమ్మి కాంగ్రెస్ కు ఓటే వేశారని, తనను కోసినా పైసలు లేవని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీస్తారని మాజీ సిఎం కెసిఆర్ బయటకి రావట్లేదని, గ్యారెంటీల గురించి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.