Reading Time: < 1 minute

కొలంబో: శనివారం నుంచి ఐసిసి టి-20 ప్రపంచకప్ ప్రారంభమైంది. అయితే ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పాక్‌ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయమై పిసిబి తమ ప్రభుత్వాన్ని స్పందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ స్టేజీలో ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, పాక్ మాత్రం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించింది.

అయితే టి-20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే పాక్ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడి విజయం సాధించింది. అయితే భారత్‌తో మ్యాచ్‌కి మాత్రం ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ మ్యాచ్ జరగకపోతే.. ఐసిసి, బ్రాడ్‌క్యాస్టర్లు, శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర నష్టాలను ఎధురుకోవాల్సి వస్తుంది. దీంతో శ్రీలంక బోర్డు.. వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరింది. ఈ విషయాన్ని పిసిబి తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. దీనిపై సోమవారం నాటికి ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.