
మల్లాపూర్ భవానీనగర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ క్లినిక్ పై మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి సహకారంతో నాచారం పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన వైద్య అర్హతలు లేకుండా అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సబ్ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల మల్లాపూర్ భవానీ నగర్‌లోని “అక్షయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్” అనే క్లినిక్‌లో ఒక వ్యక్తి సరైన వైద్య అర్హతలు లేకుండా డాక్టర్‌గా నటిస్తూ చికిత్స అందిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది.ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీం ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సైలు మల్లేష్, వాసుదేవ్, సిబ్బంది సహకారంతో నాచారం సబ్ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్ రెడ్డి తమ సిబ్బందితో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కానిస్టేబుల్ రాహుల్ ఆదిత్య (10719) మఫ్టీలో రోగిగా క్లినిక్‌కు వెళ్లి కడుపు నొప్పి ఉందని చెప్పగా అక్కడ ఉన్న వ్యక్తి డాక్టర్‌లా నటిస్తూ పరీక్షించి మందులు సూచించినట్లు పోలీసులు తెలిపారు.
తదనంతరం పంచుల సమక్షంలో విచారణ చేపట్టగా అతను తన పేరు సురే వెంకట కృష్ణ అని విచారణలో వెల్లడైంది. గత మూడేళ్లుగా ఎటువంటి వైద్య అనుమతులు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గతంలో గుంటూరు జిల్లా ఎస్ఐఎం కాలేజీలో ఇంటర్మీడియట్ బిఎస్సీ నర్సింగ్ చదువును ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే వదిలివేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మాచర్లలో రిటైర్డ్ డాక్టర్ వద్ద కంపౌండర్‌గా పని చేస్తూ వైద్య పరిజ్ఞానం సంపాదించినట్లు తెలిపాడు. ఆ అనుభవంతోనే 2022 సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చి అక్రమంగా క్లినిక్ ప్రారంభించినట్లు వెల్లడించాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి సురేష్ పై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.