
ఆమె మైనర్ బాలిక. 17 ఏళ్లలో గర్భందాల్చింది. ప్రస్తుతం 18ఏళ్ల 4 నెలలు. ప్రస్తుతం గర్భందాల్చి 30 వారాలుయ ఆమె తన గర్భస్థ శిశువు వద్దను కుంటోంది. దీంతో సుప్రీంకోర్టు శుక్రవారం ఒక టీనేజర్ తన 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతినిచ్చింది. ఒక మహిళ తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భం కొనసాగించవలసిందిగా బలవంతం చేయలేమని, అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటిపి)కి అనుమతి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులను జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెట్టింది. ఆ మహిళ కోరిన పక్షంలో బిడ్డను దత్తత ఇచ్చే షరతుపై గర్భధారణ కొనసాగించవచ్చని పేర్కొంది. ఆమె శిశువు వద్దనుకున్న పక్షంలో బిడ్డను కనాలని ఆమెను బలవంతం చేయలేమని పేర్కొన్నారు. మైనర్ బాలిక స్నేహితుడి వల్లనే గర్భందాల్చిందని,గర్భం కొనసాగడం వల్ల ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా కూడా చాలా బాధకు లోనయ్యే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది.
మెడికల్ బోర్డు రిపోర్ట్ ను పరిశీలించిన తర్వాత ఆమెకు గర్భస్రావం చేసేందుకు అనుమతిస్తే, బాలిక ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు మాత్రం, ఆమె బిడ్డను కన్నతర్వాత దత్తతకు ఇవ్వవచ్చని అభిప్రాయపడింది.అక్రమ సంతానం వల్ల బాలిక సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందని, ఆమెకు ఇష్టం లేకపోయినా బిడ్డను కనాలని ఆదేశిస్తే, ఆమె మానసికంగా కుంగిపోతుందని ఆమె తరుపు న్యాయవాది పేర్కొన్నారు. అపీలు చేయడంలో ఆలస్యం అయినా అపీలుదారి హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అపీలును అనుమతిస్తూ, గర్భాన్ని వైద్యపరంగా ముగించడానికి జస్టిస్ నాగరత్న ఆధ్వర్యంలోని ధర్మాసనం అనుమతినిచ్చింది. ఈ ప్రక్రియకు ముందు లిఖితపూర్వక హామీ సమర్పించాలని అపీలుదారును ఆదేశించింది.