
ప్రపంచ దేశాలన్నీ యుద్ధ వాతావరణంలో మునిగితేలుతున్న సమయంలో మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని కొందరు పరిశీలకులు చెపుతున్న తరుణంలో మానవ సమాజానికి యుద్ధం అవసరమా? పరిణతి సాధించిన మానవుడు సహృదయంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోలేడా? అని అనిపిస్తుంది. ఒక్క యుద్ధం కొన్ని తరాల మీద ప్రభావం చూపుతుంది కదా? కాలుష్యం పెరిగిపోయి ప్రగతి కుంటుపడుతుంది కదా? కుట్రలు, కుతంత్రాలతో వివేచన లేని నాయకులంతా అధికారం చేజిక్కించుకోవడం వల్ల, అహంభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నందు వల్ల కదా ప్రపంచం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదిఏమైనా, యుద్ధం ఎప్పుడూ వాంఛనీయం కాదు. అది మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. మానవీయ విలువలకు విలువిచ్చేవారు ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. ఉగ్రవాదాన్ని అసలే సమర్థించరు. అది ఏ మతానికి చెందిన ఉగ్రవాదమైనా? ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది యుద్ధమా? బౌద్ధమా? అన్న ఆలోచన రాగానే అశోకుడు కళింగ యుద్ధం గుర్తుకొస్తుంది. పశ్చాత్తాపంతో ఛండాశోకుడు కురుణామయుడిగా మారడం, ఆయుధాలు వదిలేసి, బౌద్ధం స్వీకరించడం గుర్తుకోస్తుంది. అంతేకాదు, ఈ దేశాన్ని చుట్టు పక్కల దేశాలన్నింటినీ బౌద్ధ దేశాలుగా మార్చిన విషయం గుర్తు కొస్తుంది. తన సొంత కొడుకును, కూతురినీ అందుకు వినియోగించడం గుర్తు కొస్తుంది. ఆధునిక సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి ప్రపంచ ప్రసిద్ధ రచయిత లియోటాల్‌స్టాయ్ నవల ‘వార్ అండ్ పీస్’ (WAR AND PEACE) గుర్తుకొస్తుంది.
మహా శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏమన్నాడంటే “ఈ ప్రపంచం నాశనమైతే అది తుపాకుల వల్లనో, మిస్సైల్స్ వల్లనో, అణుబాంబుల వల్లనో కాదు నైతిక విలువల పతనం వల్ల నాశనమవుతుంది” అని అన్నాడు. “శాంతిని నెలకొల్పే శక్తి ఒక్క బోధి సత్వుడికి మాత్రమే ఉంది. బుద్ధుడు ఏసుకు గురువు. ఏసు కశ్మీర్‌లో పదమూడేళ్లు ఉండి, బౌద్ధ సారం గ్రహించి, బౌద్ధ జీవన విధానం నేర్చుకుని వెళ్లాడు. ఏసు ద్వారానే బుద్ధుడి బోధనలు యూరపు దేశాలకు చేరాయి. జాలి, కరుణ, దయ గురించి మొదటి చెప్పింది బుద్ధేడే! ప్రకృతినీ, ప్రాణులన్నింటినీ ప్రేమించాలని చెప్పింది బుద్ధుడే! ఇప్పుడు యూరోపియనులు ఈ విషయం ఒప్పుకోరు. మళ్ళీ, అది వేరే విషయం! కానీ వాస్తవం ఇదే!” అని ఐన్‌స్టీన్ రాసుకున్నాడు.
యుద్ధం అనగానే, ఇతర దేశాలలో జరుగుతున్న యుద్ధాలతో పాటు, మన దేశంలో ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ కూడా గుర్తుకు వస్తుంది కదా? ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలు ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు ప్రపంచానికి వెల్లడించారు(బ్రీఫింగ్). అది దేశ ప్రజలకు ఎంతో గర్వాన్నిచ్చే సన్నివేశం! ఇద్దరు మహిళలు రెండు వేర్వేరు యూనిఫాంలు. వారివి భిన్నమైన మత విశ్వాసాలు. భిన్నమైన నేపథ్యం గల కుటుంబాల నుండి వచ్చిన వారు. కానీ, దేశానికి సేవలందించడమే వారి లక్షం! ఆ ఇద్దరు మహిళా ఆర్మీ అధికారుల్లో ఒకరు సోఫియా ఖురేషి అయితే, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భారత దేశానికి ఉన్న శక్తి అదే వివిధ మతాల, వివిధ ప్రాంతాల సమైక్యతతోనే దేశం ముందుకొచ్చింది. దేశమంతటా ప్రతి రంగంలో ప్రతి రోజూ మనం ఇలాంటి ఐక్యతను సాధిస్తూ వస్తున్నాం. ‘హం ఏక్ హై’ అన్న నినాదమే మనల్ని బలంగా, స్థిరంగా ఉంచుతుంది.
సోషియా ఖురేషి, వ్యోమికా సింగ్‌ల వలెనే సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్‌లు కూడా ఒకరు హిందు, మరొకరు ముస్లిం. జ్యోతిబా ఫూలే నేతృత్వంలో దేశంలో బాలికలకు విద్య అత్యవసరమని వీరిద్దరూ 1848లో పాఠశాలలు ప్రారంభించి నిర్వహించారు. దాని ఫలితం 177 ఏళ్ల తర్వాత, తొలిసారిగా దేశంలో ఇప్పుడు మళ్ళీ కనిపించింది. మిలిట్రీ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలు ముందుండి నాయకత్వం వహించడం దేశం గర్వించదగ్గ అంశం. ఆనాడు అవమానాలకు, అవహేళనలకు గురైన ఫూలే దంపతుల కృషి, ఫాతిమా షేక్ తోడ్పాటు వృథా పోలేదని అనిపించింది. “మా ప్రాధాన్యత మొదట దేశానికి! తరువాతే మతమైనా, మరేదైనా” అని అన్నాడు తాజుద్దీన్. ఈయన కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి. తాజుద్దీన్ కాదు, ఆయన తండ్రి కూడా భారత సైన్యంలో పని చేసినవారే. ఇప్పుడు తాజుద్దీన్ కూతురు కల్నల్ సోఫియా ఖురేషి ‘ఆపరేషన్ సిందూర్’ కు నాయకత్వం వహించింది.
సోఫియా భర్త కల్నల్ తాజుద్దీన్ బాగేవాడి కూడా ఆర్మీ ఆఫీసరే. బరోడాకు (గుజరాత్) చెందిన సోఫియా, బెలగావి బెల్గామ్ (కర్నాటక)కు చెందిన బాగేవాడిని 2015లో పెండ్లి చేసుకుంది. ఒక స్త్రీ ఎక్కడా మసీదులో మౌలానా కాలేదు. గుళ్లో పూజారి కాలేదు. చర్చ్‌లో ఫాదర్ (పోప్) కాలేదు. కానీ, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, ప్రధాని వంటి ఏ పదవికైనా ఎదగొచ్చు. ఈ రోజు ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించే అవకాశం రాజ్యాంగమే ఇచ్చింది. అందువల్ల డా. బిఆర్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు ఎంత విలువైనది సమకూర్చాడో అర్థం చేసుకోవాలి! జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే “మేం భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉంటాం. ఉగ్రవాదాన్ని రూపు మాపడంలో దేశవ్యాప్తంగా మా కేడర్ అంతా సైన్యం వెంటే ఉంది!” అని అన్నాడు. పాలకుల పేర్లు ఎవరినీ తీసుకోలేదు. మరోవైపు కొన్ని కొన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా?
పహల్గామ్ ఉగ్రవాడిలో అమరుడైన నేవీ ఆఫీసర్ వినయ్ సతీమణిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం చాలా దారుణమైన విషయంగా పరిగణించాలి. ఆ సోషల్ మీడియా ఎకౌంట్‌లలో అధికార బిజెపి పార్టీకి సంబంధించిన వ్యక్తులవే అధికంగా ఉన్నాయని తేలింది. అలాంటి అకౌంట్లు ఎందుకు బ్లాక్ చేయ్యలేదూ? అధికారంలో ఉన్న నాయకుల జాతీయవాదం ఇదేనా? కల్నల్ సోషియా ఖురేషిని ‘ఉగ్రవాదుల సోదరి’గా అభివర్ణించాడొక అధికార పార్టీ నేత. పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు అందించిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అధికార పార్టీకి సంబంధాలున్న వ్యక్తి. మరో అధికార పార్టీ నేత తప్పంతా పహల్గామ్ దాడిలో భర్తల్ని కోల్పోయిన మహిళలదని అన్నాడు. భర్తల్ని కాల్చి చంపుతుంటే, ఈ మహిళలు ఉగ్రవాదులపై ఎందుకు తిరగబడలేదని ప్రశ్నించాడు. టూరిస్టులకు భద్రత కల్పించలేని కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, పౌరులదే తప్పు అన్నట్లు మాట్లాడొచ్చా? మరో అధికార పార్టీ నేత హైవే మీదనే ఒక మహిళతో లైంగిక కార్యక్రమం నిర్వహించాడు. నైతికతలేని, విద్యలేని, దార్శనికులు కాని వారంతా అధికారంలో ఉంటే దేశం ఎలా ఉంటుందో దేశప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.
మనం చిన్నప్పుడు తరగతి గది గోడల మీద రాసిపెట్టిన వాక్యాలు చదువుతూ పెరిగాం. సత్యమునే పలుకుము/ అబద్ధమాడరాదు/ జీవహింస చేయరాదు/ మంచి అన్నది పెంచుము/ ప్రేమ, కరుణ, జాలి ముఖ్యము వంటివి. చదివీ చదివీ అవి మనకు కంఠతా వచ్చేశాయి. కాని వాటిని ప్రపంచానికి మొదటగా చెప్పిన మహనీయుడెవరు అన్న విషయం మన ఉపాధ్యాయులు మనకు చెప్పలేదు. తరువాత్తరువాత సత్యాన్నీ, అహింసని ఆయుధాలుగా చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేపట్టారని తెలుసుకున్నాం. కానీ, వాటిని మొట్టమొదటగా చెప్పి, ప్రపంచం కళ్లు తెరిపించిన పరిపూర్ణుడు బుద్ధుడన్న విషయం మనం చర్చించుకోలేదు. కారణం మనువాదుల కుట్రలు! బుద్ధుణ్ణి మరిపించి, వారి మనల్ని కల్పించిన దేవీదేవతల ఆరాధన వైపు, మూఢభక్తి వైపు మళ్లించారు. వాస్తవాల్ని మరిపించి, భ్రమల్లో ముంచేశారు. సుమారు 2500 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఎక్కడా ఏ జ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో ‘కార్యకారణ సిద్ధాంతాన్ని’ చెప్పి ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలకు దారివేసిన వాడు బుద్ధుడు. బుద్ధుణ్ణి, బుద్ధుడి బోధనల్ని అర్థం చేసుకున్న వారెవరైనా అసలు యుద్ధాన్ని సమర్థిస్తారా? మా‘నవ’వాదమన్న పదం ఆ ప్రాచీన యుగంలో లేదుగానీ, బుద్ధుడు బోధించింది, అశోకుడు ప్రచారం చేసింది మా‘నవ’వాదమే కదా?.
పశ్చిమ దేశాలకు బౌద్ధాన్ని పరిచయం చేసిన జర్మన్ అమెరికన్ రచయిత, PAULCARUA కారస్ (18 జులై 1852 11 ఫిబ్రవరి 1919) THE GOSPEL OF BUDDHA (1894) అనే గ్రంథం ప్రకటించాడు. అందులో బుద్ధుడు రాజగృహంలో చెప్పిన మాటలు కొన్ని పొందుపరిచాడు. అవి ఇలా ఉన్నాయి. “ఒకరినొకరు మోసగించుకోకండి. ఒకరినొకరు తక్కువ చేసుకోకండి. మీ ఆధిక్యతను ప్రదర్శించకండి. అది క్షణికం! కోపాల్ని, ద్వేషాల్ని, పగల్ని వదిలేయండి. తల్లి బిడ్డను వేయికళ్లతో ఎలా రక్షించుకుంటుందో ప్రాణమివ్వడానికి ఎలా సిద్ధపడుతుందో అలాంటి ప్రేమను మీరు మీతోటి వారికి పంచండి. ప్రేమకు హద్దులుండవని నిరూపించండి. జాతి, కరుణలతో కరిగిపోయే మృదువైన వ్యక్తిత్వాన్ని పెంచుకోండి? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. అసూయాద్వేషాలను పారద్రోలి ఏ స్థితిలో ఉన్నా అందరినీ ప్రేమిస్తూ, అన్యోన్యంగా ఉండడమే ఉత్తమ జీవిత మార్గం!” అన్నది బుద్ధుడు చెప్పిన జీవన సూత్రం! ఇది జీర్ణించుకున్న వారెవరైనా యుద్ధాలకు పూనుకుంటారా? ఆపరేషన్ సిందూర్‌కి నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా వ్యక్తిగతంగా బౌద్ధ అనుయాయి. అందువల్ల, ఈ దేశ ప్రజలు ఉద్యమించాలి! విజ్ఞత లేని నాయకత్వాన్ని గద్దె దించాలి!!.
డాక్టర్ దేవరాజు మహారాజు