
ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్- అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఒప్పందానికి ఎట్టకేలకు తెరపడింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆసియా ఎగుమతి మార్కెట్‌లో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు 50 శాతం టారిఫ్‌లతో ఎగుమతుల్లో అమెరికా మార్కెట్‌కు దూరంగా ఉన్న భారత్ సుంకాల తగ్గింపుతో ముందంజలోకి దూసుకు వచ్చింది. అమెరికా సవరించిన టారిఫ్‌లతో భారతీయ ఎగుమతిదారులకు ఏకంగా 32 శాతం పన్ను భారం తగ్గింది. ఇది భారత ఎగుమతులకు భారీ ఊరట అని చెప్పాలి.
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ పాజిటివ్ సంకేతాలు, ముఖ్యంగా భారత్ -అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా మార్కెట్లు ఓపెనింగ్ నుంచే బుల్న్‌ల్రోకి దూసుకెళ్లాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,256 పాయింట్ల లాభంతో 83,935 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 699 పాయింట్లు పెరిగి 25,787 స్థాయిలో కదలాడుతోంది. ప్రీ- ఓపెనింగ్ సెషన్‌లోనే సెన్సెక్స్ 3,600 పాయింట్ల వరకూ ఎగబాకడం విశేషం. నిఫ్టీ 26,300 మార్క్‌ను తాకి రికార్డు స్థాయిని అందుకుంది. మార్కెట్ ప్రారంభం నుంచే అన్ని రంగాల్లో కొనుగోళ్లు జోరుగా కనిపించాయి. అమెరికా భారత్‌తో ట్రేడ్ డీల్‌కు అంగీకరిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో పాటు, భారత్ ఉత్పత్తులపై ఉన్న ప్రతీకార సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విధించిన అదనపు సుంకాలు కూడా ఈ తగ్గింపులో భాగం కావడంతో భారత ఎగుమతులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎగుమతి మార్కెట్‌లో టాప్‌లో భారత్
భారత్ ఆసియా ఎగుమతి మార్కెట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో ప్రాంతీయ ప్రత్యర్థులైన చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. ఈ డీల్ ముందు వరకు ఆసియాలోనే భారీగా అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొన్న దేశం భారత్. ఒక్క రాత్రిలో అది తలకిందులైంది. ఇప్పుడు 18 శాతంతో అతి తక్కువ సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాలో టాప్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌పై 19 శాతం, శ్రీలంకపై 20 శాతం, బంగ్లాదేశ్‌పై 20 శాతం, వియత్నాంపై 20 శాతం, ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్‌పై 19 శాతం చొప్పున, చైనాపై 34 శాతం సుంకాలు అమల్లోకి ఉన్నాయి. చైనాపై భారత్ కంటే దాదాపు రెట్టింపు టారిఫ్‌లు అమల్లో ఉండటం గమనార్హం. అయితే ఆసియాలో అఫ్ఘానిస్థాన్ ఒక్కటే భారత్ కంటే తక్కువ టారిఫ్‌లు 15 శాతం ఎదర్కొంటోంది. కానీ, ఆసియా ఎగుమతి మార్కెట్‌లో అఫ్ఘానిస్థాన్ భారత్‌కు ఏ మాత్రం పోటీ కాదు.
భారత్‌కు ప్రయోజనాలు ఇవే
టారిఫ్‌ల తగ్గింపుతో అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులు చవకగా లభించి, ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, పాదరక్షల వంటి కీలక రంగాలలో వియత్నాం, బంగ్లాదేశ్‌లతో పోటీ పడుతున్న భారతీయ కంపెనీలకు భారీ ఊరట కలగనుంది. టెక్స్‌టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, ఫార్మా రంగాలు అమెరికా మార్కెట్‌లో మరింత పోటీనిస్తాయి. సుంకాల సవరింపు తర్వాత ఆసియా ఎగుమతి మార్కెట్‌లో చైనాతో పోలిస్తే భారత్ ఇప్పుడు చాలా బలీయమైన స్థితిలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్‌కు మార్చేలా ప్రోత్సహిస్తుంది. భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై ఉన్న సుంకాలను, అడ్డంకులను తొలగించి ‘జీరో’ స్థాయికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్న నేపథ్యంలో ఇరు దేశాల వాణిజ్యం కొత్త పుంతలు తొక్కనుంది.
50% నుంచి 18 శాతానికి తగ్గింపు
ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన 30 నిమిషాల ఫోన్ సంభాషణ అనంతరం, భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. గత ఏడాది కాలంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై మొత్తం 50 శాతం వరకు సుంకాల భారం పడుతోంది. ఇందులో 25 శాతం పరస్పర సుంకాలు కాగా, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామన్న కారణంతో మరో 25 శాతం టారిఫ్‌లను అదనంగా ట్రంప్ భారత్‌పై విధించారు. అయితే తాజా డీల్‌లో భాగంగా అదనపు సుంకాలను పూర్తిగా తొలగించడమే కాకుండా పరస్పర టారిఫ్‌లను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
కెనడా-భారత్ యురేనియం ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ కెనడాపై భారీ సుంకాలను విధిస్తానని బెదిరించిన సమయంలో భారత్ -కెనడా సంబంధాలు దగ్గరగా మారుతున్నాయి. ఇటీవల కార్నీ మార్చిలో భారత్ సందర్శించవచ్చని, నవంబర్ 2025 నుండి నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయి. ముఖ్యంగా యురేనియం ఒప్పందం ద్వారా సుమారు రూ. 25,000 కోట్ల (సుమారు 25 బిలియన్ డాలర్లు ) విలువైన వ్యాపారం జరుగుతుందని సూచిస్తున్నారు. భారత్ అనేక దక్షిణ అమెరికా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించింది. చమురు సరఫరా కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి ఆందోళనను మరింత పెంచాయి.
చైనా ఎగుమతులపై వాణిజ్య యుద్ధం
అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొత్తది కాదు. చైనా ఇటీవల విడుదల చేసిన ఎగుమతి గణాంకాలు, 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించగలదని చూపించాయి. అమెరికా చైనాపై అధిక సుంకాలను విధించినప్పటికీ, చైనా ప్రపంచం వివిధ దేశాలలో సుంకాలను పెంచింది. ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ప్రధాన పాత్ర పోషించగల దేశంగా ఉంది. భారత ఉత్పత్తులను పొందడం, ప్రపంచ దేశాల మద్దతు, యూరప్- భారత్ ఒప్పందం, అమెరికా కంపెనీల భారత ప్రాధాన్యతలపై దృష్టి, ఇలా కలిపి ట్రంప్ భారత్‌పై సుంకాలు తగ్గించడానికి సహకరించారని అంటున్నారు.
ఇస్కా రాజేష్ బాబు
93973 99298