Reading Time: 2 minutes

మనం సాధారణంగా ఏదో ఒక రంగంలో ఉన్న వ్యక్తి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడితే ప్రజలమనిషి అనో, ప్రజాకవి అనో, ప్రజానాయకుడు అనో అంటుంటాం. ఇటీవల కాలంలోనయితే ప్రజాసంబంధ దృక్పథం ఉన్నాలేకున్నా మీదికి అలా నాలుగు మాటలు ప్రజల గురించి మాట్లాడితే చాలు, వారిని ప్రజలమనిషి అంటూ విశేషణాలు తగిలించి ఆకాశానికి ఎగరేయటం చూస్తున్నాం. ‘ప్రజల మనిషి’ అంటే ఎలా ఉంటాడో తన ‘ప్రజల మనిషి’ నవలద్వారా చూపించారు వట్టికోట ఆళ్వారుస్వామి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మనిషి జీవితంలోని అనేక సమస్యలను అధిగమిస్తూ ప్రజానాయకునిగా ఎదిగిన వైనం ఆ నవలలో అద్భుతంగా చిత్రించబడింది. 1928 -38 మధ్య తెలంగాణ ప్రాంతపు సామాజిక చరిత్రను ప్రతిబింబించే ఆ నవలలోని కథానాయకుడు కంఠీరవం. ఆ నవలకు ముందుమాట రాస్తూ అందులోని కంఠీరవం మరెవరో కాదు ఈ నవల రాసిన వట్టికోట వారే అని తేల్చిపారేశాడు దాశరథి రంగాచార్య. నవల చదివిన వారికి దాశరథి మాటల్లోని నిజం అర్థమవుతుంది.

1930 నుంచి 50 దాకా గల సామాజిక చరిత్రను నమోదు చేయాలనే ఉద్దేశంతో వట్టికోట మూడు నవలలు రాయాలనుకున్నారు. మొదటి నవల ప్రజల మనిషి. రెండవది గంగు. దానిని పూర్తి చేయకుండానే ఆయన వెళ్ళిపోయాడు. చాలామంది ఒప్పుకోరు కానీ ‘ప్రజల మనిషి’ నవల చారిత్రక నవలనే. 1920, 30 ప్రాంతాల తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలంటే ఈ నవలను చదివి తెలుసుకోవచ్చు. అలాగే 1940-45 మధ్య కాలపు తెలంగాణ గడ్డమీది పరిణామాలను ‘గంగు’ నవలలో చిత్రించారు. ప్రజల మనిషిలోని కంఠీరవం పాత్రకు ఆనాటి చరిత్రకు అవినాభావ సంబంధముంది. ఆనాటి పరిస్థితులే పేదవాడైన కంఠీరవాన్ని ప్రజనాయకునిగా మార్చాయి. ప్రజలకు ఎన్ని మార్గాలద్వారా చైతన్యాన్ని నూరిపోయవచ్చో అన్ని మార్గాలను వాడుకున్నారు కంఠీరవం. కాదు కాదు వట్టికోట ఆళ్వారుస్వామి.

గ్రంథాలయాల స్థాపన దగ్గరినుంచి ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన అనేక ప్రజాచైతన్య కార్యక్రమాలను ముందుండి నడిపించడం దాకా వట్టికోట వారి కృషి బహుముఖాలుగా విస్తరించిందది. హోటల్ కార్మికునిగా, కాంచనపల్లి సీతారామరావు అనే ఉపాధ్యాయునికి వంటమనిషిగా, ‘గోల్కొండ పత్రిక’లో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. కందిబండ గ్రామానికి చెందిన నారపరాజు రాఘవరావు కుటుంబంతోగల పరిచయం వట్టికోట జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ కుటుంబం ఏర్పాటు చేసిన ‘సీతారామ గ్రంథాలయం’లో అనేక పత్రికలు, గ్రంథాలు చదవటం వల్ల తన ఆలోచనాపరిధి విశాలమైంది. అనేక చోట్ల పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలవల్ల సమాజం అర్థమయింది. ముఖ్యంగా బెజవాడలో హోటల్లో పనిచేస్తున్నప్పుడు నిజాం పాలన కింద ఉన్న తెలంగాణకు, బ్రిటీషు పాలనలోని ఆంధ్రాప్రాంతానికి మధ్య తేడా స్పష్టంగా తెలిసి వచ్చింది. దొరల కింద నలుగుతున్న తెలంగాణా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న ఆలోచన ఆ రకంగా కలిగి ఉంటుంది.

నిజాం నిరంకుశత్వానికి, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కలమెత్తటం, గళమెత్తటం ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. నిజామాబాదు జైలులో తనతో పాటు ఖైదీగా ఉన్న దాశరథి కృష్ణమాచారి చెప్పిన పద్యాలను గోడలమీద రాసిన సాహసి ఆయన. తన జైలు అనుభవాలను జోడిస్తూ ఖైదీల దుర్భర పరిస్థితులను మానవహక్కుల నేపథ్యంలో కథలుగా మలిచాడు. అవి ‘జైలు లోపల పేరుతో గ్రంథస్థమయ్యాయి. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని ప్రోదిచేయవచ్చు అనే సంకల్పంతో 1938లో ‘దేశోద్ధారక గ్రంథమాల‘ను స్థాపించి అనేక విలువైన రచనలను వెలుగులోకి తెచ్చారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా విపరీతమైన అణిచివేతకు గురవుతున్న ఆనాటి తెలంగాణ సమాజానికి ఆళ్వారు స్వామి చేసిన సేవలు ఎంతో విలువైనవి. ప్రజల కోసం ఇంతలా తపించిన వట్టికోట నిజంగా ప్రజల మనిషి.

తోకల రాజేశం, 96767 61415