
ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకూ 50% నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలి
నదీజలాల పరిష్కార కమిటీ భేటీలో తెలంగాణ వాదనలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రఅపదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. సుమారు రెండుగంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో భాగంగా అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు. దీంతోపాటు పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టులను అజెండాలో పెట్టవద్దని తెలంగాణ అధికారులు ఉన్నత స్థాయి కమిటీని కోరారు.
ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు 50 శాతం నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ కోరగా, తెలంగాణ లేవనెత్తిన పలు అంశాల గురించి ఎపి అధికారులు అభ్యంతరం చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎపి ప్రభుత్వం అజెండా గురించి పేర్కొనలేదు. జలవివాదాలకు సంబంధించి కమిటీ తదుపరి చర్చల కోసం వారంలోగా అజెండాను ఖరారు చేసి లిఖీత పూర్వకంగా ఇవ్వాలని కమిటీ సభ్యులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు. అజెండా అంశాలు ఖరారయ్యాక భేటీ తేదీని ఖరారు చేస్తామని చైర్మన్ స్పష్టం చేసారు.
ఏపి అజెండా చెప్పలేదని అభ్యంతరం చెప్పాం : రాహుల్ బొజ్జా
సిడబ్లూసి భేటీ ముగిసిన అనంతరం రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించామని, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని స్పష్టం చేసామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పలు జలవివాదాలు ఉన్నాయి, కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు పెండింగ్‌లో ఉండటం వల్లనే సమావేశానికి వచ్చామన్నారు. అయితే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అజెండా చెప్పలేదని, తదుపరి సమావేశం కేంద్రం జల సంఘం నిర్ణయిస్తుందని రాహుల్ బొజ్జా వివరించారు.
ఎపి, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు
ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ సలహాదారులు, ఇంజనీర్ ఇన్- చీఫ్‌లు, జలవనరుల శాఖ అధికారులు, కేఆర్‌ఎమ్‌బీ, జీఆర్‌ఎమ్‌బీ చైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్ హాజరయ్యారు.తెలంగాణ నుంచి నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, కేంద్ర రాష్ట్ర సమన్వయ అధికారి గౌరవ్ ఉప్పల్ హాజరు కాగా, ఏపీ నుంచి నీటిపారుదలశాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితర అధికారులు హాజరయ్యారు.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి జనవరి 2వ తేదీన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. గోదావరి, కృష్ణాలో అందుబాటులో ఉన్న జలాలు, నికర జలాలు, మిగులు జలాలు, ప్రాజెక్టులు సహా పలు అంశాలపై వివాదాలను పరిష్కరించుకొని ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో చరించారు.
అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు భేటీ
గత ఏడాది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు వాటిని చర్చించి సాంకేతికంగా పరిశీలించేందుకు ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించగా, ఈ మేరకు శుక్రవారం ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయ్యింది.