
కొచ్చి: శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్‌ని సిట్ శుక్రవారం విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి జయరామ్ పలు పూజల్లో పాల్గొన్నారు. బంగారం పూత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో 2019లో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరామ్ పాల్గొన్న వీడియోలు ఇటీవలనే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవైనా జరిగాయా అని సిట్ ఆరా తీసినట్టు సమాచారం. శుక్రవారం చెన్నై లోని జయ్‌రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధం ఏంటి? ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు.
మలయాళంలో సీనియర్ నటుడు అయిన జయరామ్, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రేక్షకులకు సుపరిచితుడే. అలవైకుంఠపురంలో, హాయ్ నాన్న, గుంటూరు కారం, మిరాయ్, కాంతార, చాప్టర్1 వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. శబరిమల ప్రధాన ఆలయం ద్వారపాలక(కాపలాదారు) విగ్రహాలు, మరియు శ్రీకోవిల్ (గర్భగృహం) తలుపు ఫ్రేమ్‌ల నుండి బంగారం పోయినట్టు ఆరోపణలు రావడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అయితే పొట్టితో కలిసి నటుడు జయరామ్ పలు పూజల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ పూజలు బంగారం పూత మాయం అయిన తరువాతే జరిగాయని నిర్ధారించుకున్న సిట్, ఇద్దరి మధ్య సంబంధాలపై ఆరా తీసినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో మొత్తం 12 మందిని సిట్ అరెస్టు చేసింది. ఇక ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు, మురారిబాబు, శ్రీకుమార్‌లు బెయిల్ మీద విడుదలయ్యారు. నిర్ణీత కాల వ్యవధిలో (90 రోజుల ) సిట్ వీళ్లపై అభియోగాలకు చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరైంది. మరోవైపు ప్రధాన నిందితుడు పొట్టికి కూడా బెయిల్ లభించినప్పటికీ మిగతా కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.