
చెన్నై: రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ (67)తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఉండగా శుక్రవారం తెల్లవారు జామున 12.30 గంటల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు పెరుమాల్‌పురం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఇన్‌స్పెక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
కబడ్డీ ప్లేయర్ అయిన శ్రీనివాసన్ 1991లో పిటీ ఉషను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి విఘ్నేష్ ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నారు. క్రీడా జీవితంలో ఆమె నడుపుతున్న ‘ ఉష్ స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్’ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మృతిపై పలువురు క్రీడాకారులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ పీటీ ఉషతో ఫోన్‌లో మాట్లాడి సంతాపం తెలిపారని అధికారులు వెల్లడించారు . కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం శ్రీనివాసన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.