Reading Time: < 1 minute

అమరావతి: వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డిని దెబ్బ‌తీయ‌డానికి శ్రీ‌మ‌హా విష్ణువునే వాడుకున్నారని టిటిడి మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమర్శించారు. తిరుమల లడ్డూలో ఎక్కడా జంతువుల కొవ్వు లేదని సిబిఐ రిపోర్టు ఇచ్చిన సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడారు. శివుపాలుడే సిగ్గుప‌డేలా, కంసుడే చెవులు మూసుకునేలా, స‌మ‌స్త రాక్ష‌సులు నోరు వెల్ల‌బెట్టేలా చంద్ర‌బాబు త‌న మాట‌లు, చేష్ట‌ల‌తో, వంత‌పాడే మీడియాతో తిరుమల ల‌డ్డూపై దుష్ప్ర‌చారం చేయించారని దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు క‌లిసింద‌ని టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా దుష్ప్ర‌చారం చేశారని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసంగా వ్యవహరించలేదన్నారు. చంద్రబాబు ఎత్తులను సిబిఐ నిర్వీర్యం చేయడంతో అనుచరులతో కలిసి రాజకీయ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్ర బయటపడిందని, హిందువులంతా వాస్తవాలను గమనించాలని, జగన్ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో సిఎం ఆడుకున్నారని చురకలంటించారు.