Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్‌ః  ‘నేను పార్టీ ఫిరాయించలేదు, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నాను..’ అని ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బుధవారం స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు రావడంతోనే దానం నాగేందర్ స్పందించారు. తాను పార్టీ ఫిరాయించలేదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అందజేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదని, ఆ పార్టీలోనే ఉన్నానని ఆయన అందులో తెలిపారు.

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగతంగా వెళ్ళానే తప్ప బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కాదని తెలిపారు. మీడియా కథనాల ఆధారంగానే తాను పార్టీ మారినట్లు బిఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నదని ఆయన వివరించారు. కాబట్టి తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన కోరారు. 2023

ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ ఆ తర్వాత (2024) లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు పోటీ చేయడం బహిరంగంగా కనిపిస్తున్న సాక్షమని, ఇంకా వేరే ఆధారాలు అవసరం లేదని ఆయన పిటిషన్‌లో తెలిపారు.