Reading Time: 2 minutes

మంత్రి కోమటిరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది: హరీష్ రావు

మంత్రికి తెలియకుండానే సినిమా టికెట్ రేట్లపై జిఒలు వస్తున్నాయి

సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీని మరిచారు

టికెట్ల దందా వెనుక ఓ రాజ్యాంగేతర శక్తి ఉంది

ఈ వ్యవహారంపై గవర్నర్ విచారణ జరపాలి

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక

పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది

-మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని విమర్శించారు. ఒక పక్క హోం శాఖ జిఒ ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారని పేర్కొన్నారు. ‘ఐటి మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే’ అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నానరని ప్రశ్నించారు.

టికెట్ల రేట్ల పెంపు సిఎం నిర్ణయమేనని ఆయన చెప్పకనే చెబుతున్నారని..అంటే, సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా లేనట్టా..? అని ప్రశ్నించారు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జిఒలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు..? అని నిలదీశారు. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉందని ఆరోపించారు. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారని విమర్శించారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా ప్రజా పాలన అంటే..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి నియంత్రణలో ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

ఒక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తికి తెలియకుండానే ఆ శాఖలో కీలక నిర్ణయాలు జరిగిపోవడం, జిఒలు విడుదల కావడం దారుణమని విమర్శించారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు జిఒ బయటకు వస్తే, ఆ శాఖ మంత్రి అయిన కోమటిరెడ్డి ‘నాకు తెలియదు, నా దగ్గరికి ఫైల్ రాలేదు’ అని నిస్సహాయత వ్యక్తం చేయడం ప్రభుత్వంలో పాలన ఏ స్థాయిలో ఉందో చెబుతోందని పేర్కొన్నారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది అన్నట్లుగా ఉందని, పలు శాఖలకు తానే మంత్రినని చెప్పుకొనే కోమటిరెడ్డి, ఇప్పుడు తన శాఖలో ఏం జరుగుతుందో తనకు సంబంధం లేదనడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు.