
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, గుండాలు రాజ్యమేలుతున్నారని బిజెపి మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరిట, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి పేరిట ల్యాండ్ మాఫియా, బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని ఆయన విమర్శించారు. మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటిలోని ఏకశిలా నగర్‌లో దాడి జరిగిన ్ర పాంతాన్ని సందర్శించిన ఈటల రాజేందర్ స్థానికులకు భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. తాను లోగడ గుండాల అరాచకాల గురించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చినా స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.
భూ మాఫియా గుండాల ఆగడాలు రోజు, రోజుకూ పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానీకానికి ఎవరు లేరని మాఫియా దౌర్జన్యం చేస్తే వ్యవస్థ ఎటు పోతున్నదని ఆయన ప్రశ్నించారు. తాము ల్యాండ్ బ్రోకర్ల భరతం పడతామని ఆయన హెచ్చరించారు. మీరు భయపడకండి, తమ పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని అన్నారు. మీరంతా ఐక్యంగా ఉండాలని ఆయన తెలిపారు. హ్రైదరాబాద్‌లో ప్లాటు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారని ఈటల అన్నారు.