Reading Time: < 1 minute

హైదరాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బిసి) ప్రాజెక్టు నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి పనుల పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్ పలువురు ఇంజినీరు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బిసి పనుల పునఃప్రారంభం, సంబంధిత అంశాలపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని అన్నారు.

టిబిఎం స్థానంలో ఆధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరుగుతాయని పేర్కొన్నారు. 9.8 కి.మీ సొరంగ మార్గంపై ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే పూర్తైందని తెలిపారు. భూగర్భ పరిస్థితుల అంచనాకు సపోర్ట్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. సొరంగ మార్గం రెండువైపులా తవ్వకాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంగా ఎస్‌ఎల్‌బిసికి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగ నిర్మాణ పనులపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఎస్‌ఎల్‌బిసి పూర్తి చేసి నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేస్తామని అన్నారు.