Reading Time: < 1 minute

వడోదర: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్ట్‌లు, టి-20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత విజయ్ హజరే ట్రోఫీలోనూ తన సత్తా నిరూపించుకున్నాడు. ఈ ఏడాదిని న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌తో ప్రారంభించాడు. బిసిఎ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో మరోసారి తనకు తానే సాటి అనే విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కోహ్లీ. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం అర్థ శతకంతో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కుమార సంగక్కర(28,016) రికార్డును అధిగమించాడు. కోహ్లీ కంటే ముందు స్థానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో భారత్ ఒక వికెట్ కోల్పోయి 23 ఓవర్లలో 135 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ (52), గిల్(46) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. భారత్‌కు ఇంకా 165 పరుగులు కావాల్సి ఉంది.