Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ తెలివిమీరి పోతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. కొత్త వ్యూహాలు రచిస్తూ.. ఎక్కడో దగ్గర నేరాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల సైబయ్ మాయగాళ్ల వలలో ఇద్దరు వృద్ధ దంపతులు చిక్కుకున్నారు. 17 రోజులు డిజిటల్ అరెస్ట్‌లో ఉండి.. జీవితకాలం దాచుకున్న సుమారు రూ.15 కోట్లు పోగొట్టుకున్నారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డా. ఓం తనేజా, ఆయన భార్య డా. ఇందిరా తనేజాలు 48 ఏళ్లు ఐక్యరాజ్యసమితిలో పని చేసి రిటైర్‌మెంట్ తర్వాత 2015లో భారత్‌కు వచ్చారు.

గత డిసెంబర్ 24న.. ఆ దంపతులకు పోలీసు అధికారులమంటూ.. సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని.. అరెస్టు వారెంట్లతో ఆ దంపతులను బెదిరించారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు డిజిటల్ అరెస్టు చేస్తున్నామని.. వీడియో కాల్‌లో హెచ్చరించారు. ఆ సమయంలో ఆ దంపతుల నుంచి రూ.14.85 కోట్లను కాజేశారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే.. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు డబ్బు తిరిగి వస్తాయని నమ్మించారు. దీంతో వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిపై ఎలాంటి అరెస్టు వారెంట్లు లేవని.. సైబర్ మాయగాళ్లు మోసం చేశారని దంపతులు తెలుసుకున్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.