
హైదరాబాద్: టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వం తీరు మారకపోవడం శోచనీయం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలని, చెప్పేదొకటి, చేసేది మరొకటి.. పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి అని విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా..అని అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? అని ప్రశ్నించారు. తను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని బెనిఫిట్ షోలు ఉండవని ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినావని చురకలంటించారు.
మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చాయని.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా అని ప్రశ్నించారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని, ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుందని.. మరోవైపు.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదని, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారని.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని ధ్వజమెత్తారు.
ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు? అని టిక్కెట్ల రేటు పెంపు సిఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారని, అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. అని హరీశ్ రావు నిలదీశారు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు..అని తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది అని ప్రశ్నించారు. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారని.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారని మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అని ..ధ్వజమెత్తారు.
అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ప్రశ్నించారు. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదని అన్నారు. గత పదేళ్లు మాజీ సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, ఎక్కడా వివక్ష చూపలేదని అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయని, 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలని, ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదని హితవు పలికారు.
సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు అని ఇది ప్రజా పాలన కాదని.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట అని సూచించారు. ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. అని ప్రశ్నించారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జివో ఇచ్చేది ఇంకొకరు.. అని హరీశ్ రావు దుయ్యబట్టారు.