Reading Time: 2 minutes

పరిణామక్రమంలోభాగంగా ప్రకృతితో సహజీవనం నుండి యాంత్రికజీవనం వరకు, మానవత్వం నుండి స్వార్థం వరకు, దావఖానలు లేని కాలంనుండి అవి లేకుంటే మనిషి బ్రతకలేని పరిస్థితి వరకు,మానవజీవితం సగటున వందనుండి అరవై ఏళ్ళవరకు,ఉమ్మడి కుటుంబాలనుండి వ్యష్టి కుటుంబాలవరకు పరిణితి చెందుతూ,నేటి ఈ సమాజంలో దారిద్య్రరేఖకు దిగు వు నున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతూ,శాస్త్ర,సాంకేతికరంగాలలో అభివృద్ధి శరవేగంతో పరుగులుపెడుతునప్పటికి పేదవాడి కడుపును మాత్రం నింపలేకపోతున్నదన్నది నిజం. ప్రస్తుతసమాజంలో ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవు తున్నాడే తప్పా ! పేదవాడుమాత్రం ఆ అదృష్టాన్ని నోచుకోలేక మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నాడన్నది ముమ్మాటికీ వాస్తవం.

అత్యధికశాతం ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి,ఎలాంటి కృత్రిమ రసాయనిక ఎరువులు వాడకుండా ఆహారపంటలనే పండిస్తూ ఎంతో ఆరోగ్యాంగా ఉండేవారు.కానీ నేడు సాధిస్తున్న ప్రగతిలోభాగంగా వివిధ కార్పొరేటుసంస్థలు వ్యవసాయంపైన వ్యాపారంచేయడం మెదలుపెట్టి అధికలాభాలను పొందడానికి,చల్లని బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి,వివిధరకాల పద్ధతులతో కూలీలనుపయోగించుకుంటూ అన్నిరకాల ఆహారపదార్థాలను పండిస్తూ,అధికధరలకు అమ్ముతున్నారు. ప్రస్తుతపరిస్థితులలో గ్రామాలలోనున్న సన్నకారు రైతులుకూడా వారికున్న ఒకటిరెండు ఎకరాలలో ఆహారపంటలను గాకుండా వాణిజ్యపంటలు పండించడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.అయినప్పటికీ వారికీ లాభాలురాకపోగా నష్టాలఊబిలో చిక్కుకోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలను వివిధ మధ్యమాలలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము.దీనికిగల కారణాలెన్నో ఉన్నప్పటికి.

ప్రస్తుత పరిస్థితులలో ఒకరైతు పంటపండించాలంటే ఎంతోఖర్చుతో కూడుకొని ఉంటుంది గతంలో వలే పాడిపశువులు కనుమరుగైపోయి,వివిధ యంత్రాల సహాయంతో నేలను చదునుచేసి,రసాయనాలతో కూడిన విత్తనాలను అధికధరతో విక్రయించి,అధిక దిగుబడి నిమిత్తం క్రిమి రసాయనిక ఎరువులు,మందులు వాడి పంటను పండించడం జరుగుతుంది.చివరికి అతివృష్టి,అనావృష్టి జరగకపోతే ఎంతోకొంత పంట దిగుబడి వచ్చినప్పటికీ దానికి సరైన గిట్టుబాటు ధర దొరకకపోవడం,పల్లెలలో సన్నకారు రైతులు మెదటి నుండి ఆర్థిక వెసులుబాటుకై దళారులపై ఆధారపడి,అధిక వడ్డీలకు అప్పులుజేసి చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుపోయి నానవస్థలు పడటం జరుగుతుంది.

ఇదిలా ఉంటే మార్కెట్ లలో లభించే ఆకుకూరలు,కూరగాయలు,పలురకాల ఆహారపంటలను వివిధ రసాయనికమందులు వాడి పండించడం మూలంగా అందులోని నాణ్యత, పోషకారం కోల్పోయి,వివిధ అనారోగ్య పరిస్థితులకు ఊతమిస్తుందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.చివరికి పలురకాల పండ్లను సైతం కాయలుగా ఉన్నపుడే కోసి,నిగనిగలాడే తాజారంగు రావడానికి,పండ్లుగా మారడానికి కార్బైడ్ లాంటి పదార్థాలను వాడి మార్కెట్ లోకి తెస్తే,విక్రయదారులు వాటిని తిని వివిధరోగాల బారినపడి ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. గతంలో ఎలాంటి ఆధునాతనమైన వైద్యసౌకర్యాలు లేనప్పుడు సగటు మానవుడు వంద ఏండ్లకుపైగా జీవించేవారు.కానీ నేటి శాస్త్ర, సాంకేతికాభివృద్ధిలో ఎన్నో వైద్యాలయాలు వెలసిన బీపి,షుగర్,గుండే సంబంధిత రోగాలు మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులతో జనాలు కిక్కిరిసిపోయి అర్దాయుష్షుకే పరిమితమవుతున్నారంటే కారణం అది నేడు మనం సాధిస్తున్న ప్రగతియేనని చెప్పకతప్పని పరిస్థితి.

పెద్దపెద్ద నగరాలు,పట్టణాలకు చెందిన పెద్దపెద్ద వ్యాపారస్తులు పల్లెలకు వచ్చి వ్యవసాయ భూములను కొని లేదా కాంట్రాక్టు పద్దతిలో కూలీల సహాయంతో ఆహారపంటలను పండించి వ్యాపారాలు చేస్తూ లాభాలను గడిస్తుంటే, వాటిని పండించే రైతులు నగరాలకు,పట్టణాలకు వలసలు వెళ్ళి,పొట్టకూటికై వ్యవసాయేతరపనులు చేసుకుంటూ అధిక డబ్బువెచ్చించి పండ్లు,కూరగాయలు,ఆహారధాన్యాలు కొనడం జరుగుతుంది.కేవలం ఆహారపదార్థాలే గాకుండా పాలు, నీళ్ళు, నూనెలు అన్ని కల్తీమయమై చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు.పాతికవయస్సు రాగానే విభిన్న వ్యాధులతో బాధపడే పరిస్థితులు దాపురించాయిప్పుడు.దానికితోడు ధ్వని కాలుష్యం,వాయుకాలుష్యం, జల కాలుష్యాలతో పాటు ప్లాస్టిక్ వినియోగం, పాలిథీన్ కవర్స్ వాడకం ఎక్కువైంది. దేశంలో అభివృద్ధి అనే నెపంతో అటవీ వినాశనానికి దారితీయడం, తయారీరంగంలో ముందుకుసాగడానికి ఎన్నో కంపెనీలకు అవకాశాలిచ్చి గ్లోబల్ వార్మింగ్ కు కారకులవుతున్నారన్నది వాస్తవం. మానవ సంబంధాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. మనుషులు యాంత్రిక జీవనానికి అలవాటుపడి ప్రేమ,వాత్సల్యం,అనురాగం అనే మాటలకు అర్దాలు తెలియకుండా తయారవుతున్నారు.మానవ సంబంధాలకంటే ఆర్థిక పరమైన సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది.చివరికి నేరుగా పలుకరింపులే కరువై సామజికమాధ్యమాలను వాడటం జరుగుతుంది.

పాలక వర్గానికొస్తే ‘మసిపూసి మారేడుకాయ చేసేటట్లుగా ‘గద్దెనెక్కేదాక ఎన్నో కట్టుకథలు చెప్పి,తీరా గద్దెనెక్కాగా కథలుగానే మార్చే తంతు కొనసాగుతుంది.నిమ్న వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వా లు లెక్కలకే పరిమితమై ఆచరణలో అంతగా ప్రాధాన్యతనివ్వకపోగా అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒకరిపైమరొకరు భూతులు తిట్టుకుంటూ కక్ష్యసాధింపు చర్యలకు ప్రాధాన్యతనిస్తూ,గోడమీద పిల్లిలా వ్యవరిస్తూ నూతనపోకడకు దారితిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో భారత సంస్కృతీ, సాంప్రదాయాలలో విశిష్ట స్థానం ఉండేది. ఉదాహరణకు పాశ్చాత్త దేశ స్త్రీలు మనదేశాన్ని సందర్శించి నేతన్న నేచిన చీరలను ధరించి భారతీయ స్త్రీలా తయారై సంబరపడుతుంటే, మనవాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత క్రమంగా తగ్గుతు పాశ్చాత్తవస్త్రాలను ధరించడానికి మక్కువ చూపుతున్నారు.

ఏ దేశానికైనా అభివృద్ధి అనేది అవసరమే కానీ అది సామాన్యమానవుని పురోగతికి దోహదపడాలి.మనం తలపెట్టే అభివృద్ధి కార్యక్రమం వలన ఏవైనా నష్టాలువాటిల్లుతున్నట్లైతే వాటిని అరికట్టడానికి ప్రణాళికయుతంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.కానీ దేశంలో ఎన్నో సమస్యలతో ప్రజానీకం అష్టకష్టాలు పడుతున్నారు.వారి గురించి ఆలోచించే నాయకులు కరువవుతున్నారు.ఇప్పటికైనా కేంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అట్టడుగు,పేద ప్రజానీకం గురించి ఆలోచించి పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి,పారదర్శకంగా అమలుపరిచి వారి సుస్థిర అభివృద్ధికి పాటుపడుతూ,భవిష్యత్ తరాలకు భరోసానిచ్చే కార్యక్రమాలకు పూనుకుంటూ, మార్గదర్శకంగా ఉండాలని,అలాగే సమస్త మానవాళిలో గల మార్పులను అవగతం చేసుకోవాలని కోరుకుందాం.

– డా.పోలం సైదులు

94419 30361