Reading Time: 2 minutes

నేడు న్యూజిలాండ్‌తో భారత్ తొలి వన్డే

వడోదర: సౌతాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్ అనంతరం టీమిండియా మరో సిరీస్‌కు సన్నద్ధమైంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ నేడు(ఆదివారం) తెరలేవనుంది. దీంతో ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత జట్టు నెట్స్‌లో చెమటోడ్చింది. కఠోర సాధన చేసింది. అదేవిధంగా కివీస్ సయితం భారత గడ్డపై సిరీస్ గెలవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమతూకంగా ఉన్న కివీస్ జట్టును ఎదుర్కొనేందుకు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. కోహ్లీ, రోహిత్, రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ వంటి స్టార్ ఆటగాళ్లలో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్ వంటి స్టార్ బౌలర్లు కూడా టీమిండియాకు కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు. ఇక కీవీస్ జట్టులో సయితం స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దెవోన్ కాన్వే, మిఛెల్ బ్రేస్‌వెల్, విల్‌యంగ్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్ వంటి స్టార్ బ్యాటర్లు ఉండనే ఉన్నారు. దేఓన్ కాన్వే ఇండియా పిచ్‌లపై బ్యాటింగ్ చేసిన అనుభవం సైతం వారికి కలిసొస్తుందనటంలో సందేహం. మిఛెల్ రే, జోష్ క్లర్క్‌సన్, హె, ఆదిత్య అశోక్ వంటి స్టార్ బౌలర్లలో బౌలింగ్ దళం కూడా పటిస్టంగానే ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే తొలి వన్డే హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది.

రోకో పైనే అందరి చూపు..

వన్డేల్లో నంబర్ 1 బ్యాటర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమదైన శైలిలో లెగ్-గ్లాన్స్, పుల్ షాట్లను ప్రాక్టీస్ చేస్తూ కివీస్ బౌలర్లకు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. బ్యాటింగ్‌తో పాటు ఇద్దరూ ఫీల్డింగ్ డ్రిల్స్, క్యాచింగ్ ప్రాకీస్‌లోనూ అత్యంత చురుగ్గా పాల్గొంటూ తమ ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు. ఈ సిరీస్ ముందు రోహిత్, విరాట్ ఇద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టడం విశేషం. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో ఆడిన విరాట్ కోహ్లీ, ఢిల్లీ తరఫున ఆంధ్రప్రదేశ్‌పై 131 పరుగులు, గుజరాత్‌పై 77 పరుగులు చేసి సత్తాచాటాడు. ఇక రోహిత్‌శర్మ సైతం ముంబై తరఫున సిక్కింపై కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు సాధించి తన ఫామ్‌ను చాటుకున్నాడు. అయితే ఈ వన్డేలో సైతం ఈ ద్వయం చెలరేగుతే కివీస్ బౌలర్లకు వడోదరలో చుక్కలు తప్పవనిపిస్తోంది.