
మనతెలంగాణ/హైదరాబాద్ : పిల్లల కోసం వినియోగించే అల్మాంట్-కిడ్ సిరప్‌లో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు (ఇథిలీన్ గ్లైకాల్) ఉన్నట్లు గుర్తించామని, ఆ సిరప్‌ను వాడొద్దని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (డిసిఎ) ప్రజలను హెచ్చరించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన ఎఎల్-24002 బ్యాచ్ సిరప్‌లలో కల్తీ జరిగినట్లు బెంగాల్‌లో గుర్తించామని, ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడ కం ఆపేయాలని తెలిపింది. మార్కెట్‌లో దీని విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డిసిఎ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖా సీం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, సహాయ సంచాలకులందరికీ, ఈ ఉత్పత్తి బ్యాచ్‌కు సంబంధించిన నిల్వలు విక్రయించకుండా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పపంపిణీ చేయకుండా లేదా విక్రయించకుండా రిటైలర్లు, వ్యాపారులు, పంపిణీదారులు, ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు మొదలు పెట్టింది. ఈ సిరప్ వల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇథిలీన్ గ్లైకాల్ విషపూరిత ప్రభావాల వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రులకు సూచనలు చేశారు. అల్మాంట్-కిడ్ సిరప్‌కు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే డిసిఎ టోల్‌ఫ్రీ నెంబరు 1800- 599- 6969కు సమాచారం అందించాలని సూచించారు.