
పెట్టుబడుల పేరుతో మాజీ ఐపిఎస్ అధికారి భార్యను సైబర్ నేరస్థులు మోసం చేశారు. అధిక లాభాలు వస్తాయని చెప్పి రూ.2.58కోట్లు తీసుకుని మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఐపిఎస్ విఆర్‌ఎస్ తీసుకుని రాజకీయాల్లో చేరిన బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీకి చెందిన మాజీ పోలీస్ అధికారి భార్య ఊర్మిళకు స్టాక్ మార్కెట్‌లో మెళకువలు చెబుతామని వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బాధితురాలికి స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో తన భర్త మాజీ ఐపిఎస్ అధికారి నంబర్‌ను వాట్సాప్ గ్రూప్ స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సెంజ్ గ్రూప్ 20లో యాడ్ చేయించింది. ఈ గ్రూప్‌లో 167మంది సభ్యులు ఉన్నారు. తర్వాత దినేష్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేసి గ్రూప్‌కు సంబంధించిన వివరాలు మొత్తం చెప్పారు. తమ సంస్థ సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అని, తాము చెప్పినట్లు పెట్టుబడిపెడితే 500 శాతం లాభాలు వస్తాయని చెపారు.
వాట్సాప్‌లో నకిలీ సెబీ సర్టిఫికెట్లు పంపించారు. దీంతో సైబర్ నేరగాళ్లను నమ్మిన మాజీ ఐపిఎస్ భార్య డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వరకు లావాదేవీలు నిర్వహించారు. ఇన్‌ఫోబీన్, ఎస్‌ఎంఎస్ ఫార్మా, శారద కార్ప్ తదితర సంస్థలను స్టాక్స్‌ను సైబర్ నిందితులు రికమెండ్ చేశారు. గ్రూపులో ఉన్న మిగతా సభ్యులు ఈ స్టాక్స్‌లో పెట్టుబడిపెడితే తమకు భారీగా లాభాలు వచ్చాయని స్క్రీన్ షాట్స్ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. వాటిని చూసిన బాధితురాలు తాను పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని భావించి 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లు సైబర్ నేరస్థులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత పెట్టుబడి పెట్టడం ఆపడంతో మళ్లీ పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేశారు. పెట్టుబడి పెట్టకుంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని ఆమెను బెదిరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.