Reading Time: < 1 minute

అసెంబ్లీకి వచ్చే సార్వత్రిక (2028) ఎన్నికల్లో అధకారంలోకి రాబోతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఈ లోగా జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని రాంచందర్ రావు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న న్యాయవాదులకు పిలుపునిచ్చారు.శనివారం నాంపల్లిలోని బిజెప్టి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ అధ్వర్యంలో న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంచందర్ రావు ప్రసంగిస్తూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెయ్యికి పైగా సర్పంచ్ స్థానాలను గెలుపొంది ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌కు సమానంగా నిలిచామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందాల్సిన అవసరం ఉందన్నారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ మెజారిటీ డివిజన్లను కైవసం చేసుకుని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కేరళలోని త్రివేండ్రం కార్పొరేషన్‌ను తమ పార్టీ ఇటీవల కైవసం చేసుకున్నదని ఆయన ఉదహరించారు. తమ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోనూ బలపడుతున్నదని ఆయన చెప్పారు. అన్ని ఎన్నికల్లోనూ పార్టీకి అనుబంధంగా ఉన్న న్యాయవాదులు చురుకైన పాత్ర పోషించాలని, ఉత్సాహంగా ఉన్న వారు పోటీ చేయాలని ఆయన సూచించారు. లోక్‌సభలో 197 మంది ఎంపీలు ఉన్నారని రాంచందర్ రావు చెప్పగానే న్యాయవాదులు కరతాళధ్వనులు చేశారు. ఇంకా ఈ సమావేశంలో గోకుల్ వర్మ మాట్లాడుతూ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టం, అడ్వకేట్స్ సంక్షేమ చట్టం రాబోతున్నట్లు చెప్పారు.