
నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి తట్టుకుంటానని, కానీ, మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుంది. అడ్డగోలు రాతలు మంచివి కావని ఆయన హితవు పలికారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులేనని, నా గురించి అందరికీ తెలుసనీ ఆయన అన్నారు. అయినా తనను ఇలా మానసికంగా హింసిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయానని, అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని, కానీ, ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నానని ఆయన తెలిపారు.