Reading Time: < 1 minute

హైదరాబాద్: గతేడాది అక్టోబర్‌లో మధ్యప్రదేశ్‌లో కోల్డ్-రిఫ్ అనే దగ్గు మందు వల్ల 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఉదంతం మర్చిపోక ముందే తెలంగాణలో మరో దగ్గు మందు మహమ్మారి ప్రవేశించినట్లు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. రాష్ట్రంలో చిన్నారులకు అల్మాంట్-కిడ్ సిరప్ వాడవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. అది దగ్గు మందు కాదని.. ఆ రూపంలో ఉన్న స్లో పాయిజన్ అని పేర్కొంది.

అందులో ఎథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీంతో సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని డిసిఎ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఔషధ ప్రమాద నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఓ) ఈస్ట్‌ జోన్, కోల్‌కతా నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రకటించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమిడీస్ అనే ఫార్మా సంస్థ తయారు చసిన ఎఎల్-24002 బ్యాచ్ సిరప్ శాంపిల్స్‌ను పరిశీలించగా.. అత్యంత విషపూరితమైన ఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. ఇది కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. పిల్లలకు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

ఈ అల్మాంట్-కిడ్ సిరప్‌ను ఎవరైనా కొనుగోలు చేస్తే.. దాని వినియోగాన్ని వెంటనే ఆపాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే.. నేరుగా డ్రగ్స్ కంట్రోల్ శాఖకు తెలియజేయవచ్చని లేదా టో ఫ్రీ నెంబర్ 1800-599-6969కు కాల్ చేయాలని సూచించింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద సిరప్ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని డిసిఎ అధికారులు ప్రజలను కోరారు.