Reading Time: < 1 minute

అమరావతి: అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్ ఆర్ సిపి కీలక నేత సజ్జల రామకృష్ణారావు తెలిపారు. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అక్రమంగా కట్టుకున్న నివాసంలోనే ఉంటున్నారని తెలియజేశారు. అమరావతి పేరుతో జగన్ ను దూషిస్తున్నారని, పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడానికి చంద్రబాబు నాయుడు క్లోజ్ డోర్ మీటింగ్ లో ఒప్పుకున్నారని, లోపాకారి ఒప్పందం వల్లనో, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సంబంధాల వల్లనో ఆపేశారని విమర్శించారు. జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు, ఆయన మీడియా సమాధానం చెప్పాలి? అని అన్నారు. అమరావతిలో మొదటి 50 వేల ఎకరాల్లోనే అభివృద్ధి లేదని.. మొదటి దశ అభివృద్ధి లేకుండానే రెండో దశ భూసేకరణ ఏంటి? అని ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీ 10 లక్షల చదరపు అడుగులు మాత్రమేనని, పార్లమెంట్ కూడా 7 లక్షల చదరపు అడుగులు అని అన్నారు. కానీ, అమరావతిలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ భవనాలు నిర్మిస్తామంటున్నారని చెప్పారు. రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, రైతులను చంద్రబాబు భ్రమల్లో పెడుతున్నారు. అమరావతిలో ఇంటర్నెల్ స్కామ్ లు చాలా ఉన్నాయని, తనకు ఏం అక్కర్లేదు.. అమరావతికి నిధులు ఇస్తే చాలని బాబు అంటున్నారని చెప్పారు. అమరావతిలో నీళ్లు ఎత్తిపోయడానికే వేల కోట్లు పెడుతున్నారని, అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ఖాజానాను కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, మొబలైజేషన్ అడ్వాన్స్లతో దోచుకుంటున్నారని సజ్జల ధ్వజమెత్తారు.