
తిరువనంతపురం: బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ నోబెల్ బహుమతి గ్రహీత అయినప్పటికీ మతోన్మాద ఉగ్రవాదులతో కుమ్మక్కు అయ్యారని, ఆ దేశంలోని చీలిక అధికార శక్తులకు సాధికారత కల్పిస్తున్నారని బంగ్లాదేశీ స్వీడిష్ రచయిత్రి తస్లీమా నస్రిన్ తీవ్రంగా ఆరోపించారు. కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ (కెఎల్‌ఐబిఎఫ్) నాల్గవ ఎడిషన్‌లో ‘బుక్‌ఫర్ పీస్’ అంశంపై ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా యూనస్ తీరుపై నిప్పులు కురిపించారు. సెక్యులరిజాన్ని, సామాన్య ప్రజల భద్రతను బెదిరించే అజెండాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొంతమంది మత దురహంకారులు, తీవ్రవాదులు తనను, తన రచనలకూ ముప్పు కలుగజేస్తామని బెదిరించగా, వారిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా తనకు వ్యతిరేకంగా అరెస్ట్ వారంట్ జారీ చేశారని ఉదహరించారు.
మత దురహంకారులు, మతోన్మాదుల పైన ఆనాడే చర్యలు తీసుకుని ఉంటే ఆ దేశం లోని పరిస్థితులు ఇప్పటిలా అధ్వాన్నం కాక ఉండేవన్నారు. పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సెక్యులర్ విద్యాసంస్థలను,సైన్స్ అకాడమీలను నిర్మించడానికి బదులు మత దురహంకారుల మద్దతు పొందడానికి,సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడానికి మతపర విద్యాసంస్తలను నిర్మిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ చీలిపోయిందని, ముస్లిం ఉగ్రవాదులు మారణ కాండ సాగిస్తున్నారని, మతపరమైన మైనార్టీలను పీడిస్తున్నారని ,ఇది ఆగిపోవాలని నస్రీన్ స్పష్టం చేశారు.