Reading Time: < 1 minute

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని పనులు పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కావాల్సింది. కానీ, అనుకోని విధంగా ఈ సినిమాకు సెన్సార్ సమస్య తలెత్తింది. అయితే ఈ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డను మద్రాసు హై కోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కానీ, అనూహ్యంగా ఈ సినిమాకు మరో షాక్ తగిలింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో విజయ్ అభిమానులు సహా, చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సిబిఎఫ్‌సి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది.