Reading Time: 2 minutes

మరో ఇరవై ఏళ్లలో తెలంగాణ అభ్యుదయ పథం ఎలా ఉండాలో ముందుగానే గత నెల ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ విజన్ 47ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం కోటి ఆశల కాంతులతో ‘విజన్47’ కు స్వాగతం పలుకుతోంది. వివిధ రంగాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి నిర్దేశించుకున్న లక్షాల్లో కొన్నయినా ఈ సంవత్సరం (2026) నెరవేరుతాయన్న నమ్మకంతో ప్రజలు ముఖ్యంగా యువత ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 47 కేవలం విధానపరమైన దృష్టి మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్షల నుంచి ఉద్భవించిన దార్శనికత. ప్రజలచే రూపొందించబడిన సమష్టి నమూనా. తెలంగాణ భవిష్యత్ చిత్రం ఎలా ఉండాలో స్పష్టంగా వివరించడానిక రాష్ట్రం మొత్తం మీద ప్రజలతో సంప్రదింపులు, అర్బన్, పెరీ అర్బన్, రూరల్ సమాజాలను సన్నిహితం చేసి వారి అభిప్రాయాలను క్రోడీకరించి భవిష్య ప్రణాళికను సాక్షాత్కరింప చేశారు. ఈ అభిప్రాయాల సేకరణలో ప్రజలు ముఖ్యంగా ఉత్తమ పాఠశాలలు, నాణ్యమైన ఆరోగ్యభద్రత, స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన పరిసర ప్రాంతాలు ఉండాలని, జీవనం సరళంగా ఉండేలా చూడాలని, ఉద్యోగాలు లేదా ఉపాధి ప్రజల నివాసాలకు అందుబాటులో ఉండాలని, వివరించడం గమనార్హం. ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాల్లో 65 శాతం యువకుల నుంచి వచ్చినవే.

ముఖ్యంగా మానవ అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, కృత్రిమమేధ, సాంకేతికత, ఐటి, అత్యంత ఆధునికత, వ్యవస్థాపకత వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అవకాశాలు కల్పించాలన్నదే యువతరం ఆశగా కనిపించింది. తెలంగాణ రైజింగ్ విజన్ ఫలితాలు కేవలం ప్రభుత్వ ప్రాధాన్యాలే కాదు, దాదాపు 4 కోట్ల మంది పౌరుల ఆశలు, స్వప్నాలు. ౨౦౨౫-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో ప్రస్తుత ఎస్‌జిడిపి 200 బిలియన్ డాలర్లు అంటే రూ. 18,00,003 కోట్లు కాగా, 2047 నాటికి అయిదు రెట్లు పెరగాలని, అంటే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని తెలంగాణ కాంక్షిస్తోంది. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు రవాణా, నీటి కొరత, నగర ప్రజల రద్దీ, వాతావరణ మార్పులు, ఇతర సమస్యలు, సవాళ్లను అధిగమించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్స్, బయోటెక్, ఫార్మా తదితర ముఖ్యమైన రంగాల్లో ప్రపంచ వాణిజ్యరంగంలో భారీ వాటా దక్కించుకోవాలని తెలంగాణ పట్టుదలతో ఉంటోంది.

తెలంగాణ రైజింగ్ విజన్‌ను సాధించాలంటే హైదరాబాద్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా సమాంతరంగా ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడాల్సి ఉంది. వ్యవసాయ ఆధారిత, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు కూడా అత్యంత ఆధునికంగా మార్పుచెందాలి. కూరగాయల పెంపకం, కాయధాన్యాల ఉత్పత్తి అభివృద్ధి కోసం జోన్లవారీగా కొన్ని రాయితీలు కల్పించాలి. డీప్‌టెక్, ఎఐ, క్వాంటమ్, కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి వీలుగా 200 ఎకరాల ఎఐ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని నెలకొల్పారు. స్థానిక యువతలో నైపుణ్యం అభివృద్ధి చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటవుతోంది. నిపుణులైన ప్రవాస భారతీయులను రప్పించి స్థానిక యువతకు శిక్షణ ఇప్పిస్తారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సమాంతరంగా సాగేలా రాష్ట్ర ప్రభుత్వం విజన్‌లో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ’ (ప్యూర్) రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేడ్) మోడళ్లను నిర్దేశించుకుంది.

క్యూర్ ద్వారా అవుటర్ రింగ్ రోడ్ పరిధి లోని అన్ని రీజియన్లు అభివృద్ధి చేస్తారు. టెక్నాలజీలో హైదరాబాద్ అనుసంధానంగా డీప్‌టెక్, పరిశ్రమలు, ఆర్ అండ్ డి డిజైన్ స్టుడియోలు, స్టార్టప్ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. పూర్ కింద అవుటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యన అన్ని రీజియన్లు తయారీ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఇ సముదాయాలు ఏర్పాటవుతాయి. రేర్ కింద రీజినల్ రింగ్ రోడ్డు అవతల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతాయి. పాడి పరిశ్రమ, చేపల పెంపకాలు చేపడతారు. అడవుల ఆధారంగా జీవన వ్యవస్థలు మెరుగుపరుస్తారు. చేనేత మగ్గాలు, హస్తకళలు, పర్యావరణ, పర్యాటకం, అభివృద్ధి చేస్తారు. డిజిటల్ మార్కెట్ అనుసంధానంతో గ్రామీణ ఆదాయం పెంచుతారు. తెలంగాణ యువత సాధికారత పెంచడానికి 2023 నుంచి తెలంగాణ ప్రభుత్వం 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 6 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించడమైంది.

పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమగ్రమైన నైపుణ్యం అభివృద్ధి కోసం అప్రంటిస్ విధానాలను విస్తరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యువబుల్స్, ఆధునిక ఉత్పాదకత, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో యువతకు శిక్షణ కల్పిస్తారు. మహిళా సంక్షేమానికి సంబంధించి కోటిమంది మహిళా మిలియనీర్లును సృష్టించడానికి ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. విద్య నుంచి వ్యాపారాల వరకు మహిళలను ప్రోత్సాహించాలన్నదే దీని ఉద్దేశం. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించడానికి స్త్రీ నిధి ద్వారా 4.5 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపు (ఎస్‌హెచ్‌జి)లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీనివల్ల 65 లక్షల మంది మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లభించింది. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా ప్రఖ్యాతి వహించిన సంగతి తెలిసిందే. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా వంటి పథకాలు అమలై వ్యవసాయదారులను ప్రభుత్వం ఆదుకుంటోంది.