
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి – ఆలేరు మధ్యలో రైలు నుంచి పడి నవదంపతులు మృతి చెందిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. మృతికి ముందు రైలులో దంపతులు గొడవపడ్డారు. భర్తతో గొడవ పడి క్షణికావేశంలో ముందుగా రన్నింగ్ ట్రైన్ నుంచి భార్య భవాని దూకింది. ఆ వెంటనే భయంతో భర్త సింహాచలం కూడా ట్రైన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం(25), భవాని(22) రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో అద్దె ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు. దంపతులు గొడవ పడి భార్య ముందు దూకింది. వెంటనే భర్త భయపడి రైలులో నుంచి బయటకు దూకాడు. ట్రాక్‌మెన్ మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.