Reading Time: < 1 minute

న్యూయార్క్: ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయని ట్రూత్ లో ట్రంప్ పోస్టు చేశారు. హర్మూజ్‌ జలసంధిలో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు అమెరికా సహకరిస్తుందని, ఇరాన్ తో చాలా సానుకూల చర్యలు కనిపిస్తున్నాయని ట్రంప్ వివరించారు.  పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. ఇరాన్‌పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల పాటు దాడులు ఉండవన్న ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్‌ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్‌ అంగీకారించడంతో 10 పాయింట్లతో ఇరాన్‌ నుంచి అమెరికాకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. రెండువారాలపాటు హార్ముజ్ లో రాకపోకలకు అనుమతి ఇస్తామని భద్రతామండలికి ఇరాన్ తెలిపింది.  లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయని ఆ దేశపు అధికారులు తెలిపారు. ఇరాన్‌ శాంతి ఒప్పందం లెబనాన్‌, హెజ్బొల్లాకు వర్తించదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. 

కాల్పుల విరమణ విషయంలో ఇరాన్ పలు షరతులు విధించింది. ఇరాక్, లెబనాన్ , యెమెన్‌లపై యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఇరాన్‌పై యుద్ధానికి సంపూర్ణ , శాశ్వత విరమణ ప్రకటించాలని కోరింది. ఈ ప్రాంతంలోని అన్ని దాడులను పూర్తిగా నిలిపివేయాలని, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతోపాటు నౌకాయాన స్వేచ్ఛకు, భద్రతకు కొన్ని నియమాలు, షరతులను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇరాన్‌ పునర్నిర్మాణానికి పూర్తి పరిహారం చెల్లించడంతో పాటు ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్లు పెట్టింది. అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ నిధులు, ఆస్తులు విడుదల చేయాలని కోరింది. ఈ షరతులు అమలు చేస్తేనే ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయమని ఇరాన్ స్పష్టం చేసింది. పై షరతులకు ఆమోదం లభించిన వెంటనే తక్షణమే కాల్పుల విరమణ అమలు చేస్తామని ఇరాన్ ప్రకటించింది.