
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అంతకుముందు, కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి అలీపూర్ సర్వే భవనం వరకు ఆమె రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత దీదీ.. భవానిపూర్ నియోజకవర్గంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. “నేను ఇక్కడే, భవానిపూర్‌లోనే పుట్టి పెరిగాను. నా జీవితంలో ప్రతీదీ ఇక్కడి నుంచి మొదలైంది” అని మమత అన్నారు. భవానిపూర్ తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాల్లోని తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆమె బావోద్వేగంతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓటర్ల జాబితాల నుండి అనేక పేర్లను తొలగించారని, అందులో అవకతవకలు జరిగాయని బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. “ఓటర్ల జాబితాల నుంచి ఇన్ని పేర్లను తొలగించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఓటర్ల జాబితాలను ఎందుకు స్తంభింపజేశారో నాకు అర్థం కావడం లేదు. దీనిపై మేము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామం” అని బెనర్జీ అన్నారు.
కాగా, భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి మరసారి పోటీ చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.