
Story Board: హైదరాబాద్, బెంగళూరు వంటి పది నగరాల్లోని పాఠశాల విద్యార్థులపై ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన సర్వే ఒక చేదు వాస్తవాన్ని వెల్లడించింది. 12, 13 ఏళ్ల నుంచే పలువురు పిల్లలు మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు అది స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఏడేళ్లనుంచే పిల్లలు వాటికి అలవాటుపడుతుండటం ఇంకా ఎక్కువగా కలవరపరుస్తోంది. ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కళాశాలలూ వర్సిటీల్లోనూ డ్రగ్స్ రాకాసి స్వైరవిహారం తరచూ బయటపడుతూ దేశ భవిష్యత్తుపై భయాందోళనలు రేపుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తోంది. మొదట్లో హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అనుకున్న డ్రగ్స్ ఇప్పుడు.. ఎడాపెడా ఎక్కడపడితే అక్కడ పట్టుబడుతున్నాయి. చివరకు డ్రగ్స్ పెడ్లర్లలో డాక్టర్లు, టీచర్లు, విద్యార్థులు కూడా ఉండటం అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. అంతకుముందు పబ్బులు, క్లబ్బుల్లో మాత్రమే డ్రగ్స్ దందా జరుగుతోందనే భ్రమలో ఉన్న అధికారులకు.. ఇటీవలి కేసులు కళ్లు తెరిపిస్తున్నాయి. ఉదాహరణకు వీకెండ్‌లో డాక్టర్లంతా ఓ చోట కలుస్తుంటారు. అది పైకి సాధారణ గెట్‌టుగెదర్‌లాగే ఉంటుంది. కానీ పొరపాటున పోలీసులొస్తే.. వారంతా కంగారు పడతారు. పరారవటానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భాల్లో డాక్టర్ల దగ్గర డ్రగ్స్ దొరకటం చూసి పోలీసులు విస్తుపోతున్నారు. అదే సమయంలో స్కూలు బ్యాగ్‌లు, కాలేజీ క్యాంటీన్లలో డ్రగ్స్ పట్టుబడే కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలాసార్లు విద్యాసంస్థల యాజమాన్యాలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చినా.. ప్రతి విద్యార్థిని 24 గంటలు తాము మాత్రం ఎలా గమనించగలమని అవి చేతులెత్తేశాయి. చివరకు క్యాంపస్‌లో డ్రగ్స్ దొరక్కుండా జాగ్రత్తపడుతున్నాయి. కానీ డ్రగ్స్ మత్తుకు అలవాటుపడ్డ విద్యార్థులు ఏదో మార్గంలో డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం.. డ్రగ్స్ చాక్లెట్లు, డ్రగ్స్ సిగరెట్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అధికారులు డ్రగ్స్‌కు ఓ తలుపు మూసేస్తే.. మరో నాలుగు తలుపులు తెరుచుకుంటున్నాయి. అందుకే టాస్క్ ఫోర్స్, ఈగల్ పేరుతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసినా.. అనుకున్న స్థాయిలో డ్రగ్స్‌ను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు..చేయాల్సిన పని వదిలిపెట్టి స్టూడెంట్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కేరళలోని వడకరలో రెండ్రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన MDMA రవాణలో కేసులో ముగ్గురు టీచర్లతో సహా ఓ డెలివరీ బాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భాగంగా నిందితుల వాట్సాప్ మేసేజ్ లు, బ్యాంకు అకౌంట్ల ట్రాన్సాక్షన్లు పరిశీలించిన పోలీసులు..డ్రగ్స్ సరఫరా వెనుక కింగ్ పిన్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడటం, డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం వారి వ్యక్తిగత జీవితాలనే కాదు.. యువత భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ఇలాంటి ఘటనలు వృత్తి గౌరవాన్ని, నైతిక బాధ్యతను గుర్తుచేస్తున్నాయి.
సరదాకో, స్నేహితుల ప్రోద్బలంతోనో గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు చేరువై క్రమంగా ఆ ఊబిలో కూరుకుపోతున్నవారిలో చాలామంది మానసిక రుగ్మతలు మొదలు గుండెజబ్బులు, క్యాన్సర్ల వంటి ప్రాణాంతక వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు కావాల్సిన డబ్బుకోసం వాటి విక్రయానికి సిద్ధపడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలకూ తెగబడుతున్నారు. గంజాయి మత్తు తలకెక్కి రాత్రిళ్లు వీధుల్లో గొడవలకు దిగుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. జీవితాలు అల్లకల్లోలమై ఆఖరికి ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. కాసుల యావతో జాతి భవితవ్యాన్ని చీకట్లోకి నెడుతున్న డ్రగ్స్ కింగ్ పిన్లకు త్వరగా శిక్షలు పడకపోతుండటం వల్లే డ్రగ్స్ వెల్లువకు అడ్డుకట్టవేయడం సాధ్యపడట్లేదు.
ఎన్‌డీపీఎస్ చట్టం కింద 2022-24 మధ్య దేశవ్యాప్తంగా మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. 3.75 లక్షల మంది అరెస్టయ్యారు. కానీ, 268 మందికే శిక్షలు పడ్డాయి. తనిఖీలు, నమూనాల జప్తు, తరలింపుల్లో లోపాలు, ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆలస్యం వంటివి దుర్మార్గులకు వరమవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులు లేకపోవడం వల్లా కేసుల మేటలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సంబంధిత కేసులు నాలుగు లక్షల వరకు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ వీలైనంత త్వరగా కొలిక్కి రావాలంటే- అవసరానికి తగినట్లు అన్నిచోట్లా స్పెషల్ కోర్టులను ఏర్పాటుచేయాలి. డ్రగ్స్ కేసుల దర్యాప్తులో సిబ్బందికి తగిన శిక్షణ అందించాలి. మాదకమూకల పీచమణచడంలో అన్ని రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏం చేస్తున్నారో కనిపెట్టుకుని ఉంటూ, వారి ప్రవర్తనలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలి. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామాలపై విద్యార్థులకు అనునిత్యం అవగాహన కల్పిస్తూ, వారిని సరైన దారిలో నడిపించాలి. లేకపోతే భావి భారతం మనం ఊహించలేనంత ప్రమాదకరంగా మారుతుందని చెప్పటానికి సంకోచించాల్సిన పని లేదు.
ఈ కారణంగానే ఐఐటీ IIT, ఐఐఎంలతో సహా దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఐఐటీ, ఐఐఎంలతో ప్రారంభించి అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోనూ విద్యార్ధులకు అడ్మిషన్ల సమయంలోనే స్వచ్చంద డ్రగ్స్ టెస్టులు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆయా సంస్థల్లో అడ్మిషన్లు కోరే అభ్యర్ధులు తమ అడ్మిషన్ పత్రాలతో పాటు యాంఫెటమైన్లు, కొకైన్, గంజాయి, బెంజోడయాజెపైన్లు, ఫెన్సైక్లిడిన్ వంటి మాదకద్రవ్యాల నిర్ధారణకు స్వచ్ఛందంగా యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి. కేంద్ర విద్యా శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం చేపట్టిన ఈ కార్యక్రమం, దేశంలో మాదకద్రవ్యాల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా చెప్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్ 2026-29లో దీన్ని జత చేశారు. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో కేంద్ర నిధులతో నడిచే 170 ఉన్నత విద్యా సంస్థలలోని సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు దశలవారీగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
2029 నాటికి 10 లక్షల మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై పరీక్షలు నిర్వహించే మిషన్ ను ప్రధాని మోడీ ఆగస్టు 2న ప్రారంభించారు. దీనికి నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్‌గా పేరు పెట్టారు. ఢిల్లీ ఎయిమ్స్ లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ ఈ మేరకు కాలేజీలు, వర్సిటీల విద్యార్ధులకు డ్రగ్స్ పరీక్షల కోసం మార్గదర్శకాలు ఇచ్చింది. ఇందులో డ్రగ్స్ పరీక్ష పూర్తిగా స్వచ్ఛందంగా, గోప్యంగా ఉండాలని, పరీక్ష చేయించుకునే విద్యార్థులపై ఎటువంటి ప్రతికూల పరిణామాలకు దారితీయకూడదని, దీనిని కేవలం కౌన్సెలింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉంచాలని సూచించింది. ఈ డ్రగ్ పరీక్షల కార్యక్రమం మూడు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశలో ఈ ఏడాది ఐఐటీలు, ఐఐఎంలు, ఒక సెంట్రల్ యూనివర్శిటీలో చేపడతారు. వచ్చే ఏడాది 32 ఎన్ఐటీలు, ఎనిమిది ఐఐఎస్ఆర్ లు, మూడు ఎస్పీఏలు, 25 ట్రిపుల్ ఐటీలు, కేంద్ర నిధులతో నడిచే నాలుగు జేఎన్టీయూల్లో చేపడతారు. ఆ తర్వాత 2028-29లో 46 సెంట్రల్ యూనివర్సిటీలు ,నాలుగు డీమ్డ్-టు-బి విశ్వవిద్యాలయాలకు వీటిని విస్తరిస్తారు. డ్రగ్స్ తాత్కాలిక ఉత్తేజాన్ని ఇవ్వొచ్చు కానీ…అవి జీవితం మొత్తాన్నీ నాశనం చేస్తాయని ప్రధాని మోడీ యువతను హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
తమ పిల్లలు బుద్ధిమంతులనీ వారికి ఎలాంటి దురలవాట్లూ లేవనీ తల్లిదండ్రులు నమ్ముతారు. పిల్లల్ని నమ్మడం మంచిదే కానీ పరిస్థితులని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. టీనేజర్లు తల్లిదండ్రుల కళ్లు కప్పి సిగరెట్ కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం. ఇప్పుడు మరొకడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు. చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు. ఉద్యోగవ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణం. అవసరానికి మించి స్వేచ్ఛా డబ్బూ అందుబాటులో ఉండడం వారిని తప్పుదారి పట్టేలా చేస్తోందనీ అంటున్నారు. పిల్లలు డ్రగ్స్ తీసుకోవటానికి అలవాటు పడ్డాక, డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలెడితే అప్పుడు కానీ తల్లిదండ్రులకు తెలియడం లేదు. కాబట్టి ఎవరి పిల్లల గురించి వారే మొదట జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూళ్లు, కాలేజీల నుంచి టైంకి ఇంటికొస్తున్నారా.. లేదా..? బ్యాగుల్లో ఏం తీసుకెళ్తున్నారు..? ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు..? లాంటి కనీస జాగ్రత్తలు పాటించటం అత్యవసరమని నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఇల్లు డ్రగ్స్ రహితం కావాలనే సంకల్పం తీసుకుంటే.. ఆటోమేటిగ్గా హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు కూడా డ్రగ్స్ రహితం కావడం పెద్ద కష్టం కాదు. చివరిగా దేశం కూడా డ్రగ్స్ నుంచి విముక్తం అవుతుంది.