
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం కాంగ్రెస్ పోరాటాలు చేస్తుందని, విభజన హామీలను అమలుచేయాలని కొట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రోజు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సంఘటన్ సోచన్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సాగు, తాగునీటికి పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అని, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని మోదీ సర్కార్‌కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. రైతుల మేలు చేకూర్చే ప్రయోజనాలు అంటే బీజేపీ పట్టవన్నారు. అదానీ, అంబానీలకు తప్ప బీజేపీకి పేద ప్రజలకు న్యాయం చేయడం తెలియదన్నారు.
కుల సర్వేతోనే సీఎం రేవంత్ బీసీలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను గుర్తించారని, అందులో భాగంగానే 52 శాతం మున్సిపాలిటీలలో బీసీలకు సీట్లు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్నివర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించడమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. రెండేండ్లలో 70 వేల ఉద్యోగాల కల్పన, ఉచిత రవాణా, సన్న బియ్యం వంటి పథకాలను కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు గోదావరిలో పోసిందన్నారు. 2028-29 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. బావాబామ్మర్దులు సీఎం కావాలని పోటీపడుతున్నారని, కేసీఆర్ కుటుంబానికి డబ్బుల పంపకాల కొట్లాటలే సరిపోయాన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో క్రూడాయిల్ ధర 153 డాలర్లు ఉంటే పెట్రోల్ రూ.60కి మించలేదన్నారు.
ప్రస్తుతం మార్కెట్లో 45 డాలర్లకు క్రూడాయిల్ దొరుకుతున్నా పెట్రోల్ మాత్రం రూ.110కి చేరిందని విమర్శించారు. 2014లో జూటా మాటలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేవిధంగా, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్షంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కూచకుల్లా రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచందర్ రెడ్డిలు ప్రసంగించగా, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మీనాక్షి నటరాజన్, ఇందిరా శర్మన్, కేతూరి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, జడ్పీ, మాజీ వైస్‌చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్ లతోపాటు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.