Reading Time: < 1 minute

ప్రపంచ మార్కెట్లో విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తాజాగా టాటాకు చెందిన విమాన సంస్థ ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమాన చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుండి ఈ కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారు దూరం ప్రకారంగా రూ.299 నుండి రూ.899 వరకు అదనపు ఇంధన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. అమెరికా, కెనడా వంటి సుదూర దేశాలకు వెళ్లే వారు సుమారు 280 డాలర్లు అంటే రూ.23,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విమాన నిర్వహణ ఖర్చులో ఇంధనమే 40 శాతం వరకు ఉంటుందని, అందుకే ఈ పెంపు తప్పలేదని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఎయిర్ ఇండియా సీఈఓ రాజీనామా

ఎయిర్ ఇండియా సిఇఒ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్‌లో బాధ్యతల నుండి వైదొలగనున్నారు. గత వారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించారు. విల్సన్ 2022లో బాధ్యతలు చేపట్టారు, అయితే ఆయన ఒప్పందం 2027 వరకు ఉంది. సంస్థ ప్రస్తుతం రూ.20,000 కోట్ల నష్టాల్లో ఉండటం, గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి సవాళ్ల మధ్య ఈ మార్పు చోటుచేసుకుంది. కొత్త సిఇఒ కోసం అన్వేషణ ఇప్పటికే ప్రారంభమైంది.