
ఇరాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత్ ప్రభుత్వం సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతున్న వేళ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం అత్యవసర సూచనలు జారీ చేసింది. భారతీయులు వచ్చే 48 గంటలు తమ ప్రస్తుత ప్రదేశాల్లోనే ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని సూచించింది. బహుళ అంతస్తుల భవనాల్లో ఉండకూడదని కూడా సూచనలు చేశారు. వైమానిక దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్తలు తీసుకోవాలని రాయబార కార్యాలయం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఇంట్లోనే ఉండాలని,
ముఖ్యంగా హైవే మార్గాల్లో ప్రయాణాలు చేయాల్సివస్తే రాయబార కార్యాలయం మార్గదర్శకత్వంలోనే చేయాలని సూచించారు.రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన హోటళ్లలో ఉన్న భారతీయులు తప్పనిసరిగా గదుల్లోనే ఉండాలని, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని పేర్కొంది. పరిస్థితులపై అధికారిక సమాచారాన్ని నిరంతరం గమనించాలని, అత్యవసర సహాయం కోసం ఇచ్చిన ఫోన్ నంబర్లు (989128109115, 989128109102, 989128109109, 989932179359) పనిచేస్తున్నాయని వెల్లడించింది. అవసరమైతే ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించింది.
ట్రంప్ బెదిరింపులు
ఇదిలా ఉండగా ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ రాత్రి ఇరాన్ నాగరికత అంతరించిపోతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే తుది నిర్ణయం పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, అవసరమైతే చివరి క్షణంలో దాడిని నిలిపివేయవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని ప్రపంచ చరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా ఆయన అభివర్ణించారు.
హార్మూజ్ జలసంధిపై తుది హెచ్చరిక
హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలే ఈ పరిణామాలకు కారణమవుతున్నాయి. ఈ కీలక సముద్ర మార్గాన్ని ఇరాన్ తెరవకపోతే తీవ్ర దాడులు చేస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. మొదట 48 గంటల గడువు ఇచ్చినా, తరువాత దానిని పలుమార్లు పొడిగించి మొత్తం 408 గంటలకు చేర్చారు. గడువులు మారుతున్న నేపథ్యంలో అమెరికా చర్యలపై అనిశ్చితి కొనసాగుతుండగా, పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన పెరుగుతోంది.