
అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు హెచ్చరికలు చేశారు. ఇది ఇరాన్‌పై ఇప్పటివరకు చేసిన అత్యంత కఠిన హెచ్చరికల్లో ఒకటి. ఈ రోజు ముగిసేలోపు ఇరాన్ నాగరికత పూర్తిగా అంతం అయిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రే ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది, మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. అది జరగకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. అయితే పరిస్థితులను బట్టి చివరి క్షణంలో దాడిని నిలిపివేసే అవకాశమూ ఉందని చెప్పిన ఆయన, ఈ రాత్రిని ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు. ఇరాన్‌లో పూర్తి స్థాయి పాలన మార్పు జరిగి, మరింత వివేకవంతమైన నాయకత్వం వస్తే విశేషమైన మార్పులు సంభవించవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న దోపిడీ, అవినీతి, మరణాల పాలనకు ఇది ముగింపు కావచ్చు. ఇరాన్ ప్రజలకు దేవుని ఆశీస్సులు ఉండాలి అని ఆయన అన్నారు.
ఇదే సమయంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు తిరిగి తెరవకపోతే, దాని ఇంధన మౌలిక సదుపాయాలపై తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. మొదటగా ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చిన ట్రంప్, ఆ గడువును పలుమార్లు పొడిగించారు. తాజా నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 7ను కొత్త గడువుగా నిర్ణయించారు. మొదటి గడువు ఐదు రోజులు కొనసాగగా, మార్చి చివర్లో మరో 10 రోజులు చేర్చారు. మొత్తం గడువు 48 గంటల నుంచి 408 గంటలకు పెరిగింది. అయితే ఈ గడువులు వరుసగా పొడిగించడం వల్ల అమెరికా స్పందనపై అనిశ్చితి నెలకొంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో, దాని మూసివేత అంతర్జాతీయ ఇంధన భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలను పెంచింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి వేగంగా మారుతూ ఉండగా, అమెరికా తదుపరి చర్యలపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమై ఉంది.