
ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు కేంద్రంగా భావించే ఖర్గ్ దీవిపై అమెరికా మళ్లీ దాడులు జరిపింది. రహదారులతో పాటు ఓ రైల్వే వంతెనను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. వైట్ హౌస్‌కు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి అనధికారికంగా ఈ సమాచారం వెల్లడించారు ఇరాన్ కూడా దీనిని ధ్రువీకరించింది. మంగళవారం అమెరికా దళాలు దీవిలోని కనీసం 50 సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు జరగడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఖర్గ్ దీవి ఆర్థిక ఆయువుపట్టు. ఇక్కడి నుంచే చమురు ఎగుమతులను ఇరాన్ 90 శాతం నిర్వహిస్తుంటుంది. ఇరాన్ తమ డిమాండ్లను అంగీకరించకపోతే భారీ దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఖర్గ్ దీవిలోని కీలక చమురు మౌలిక వసతులను స్వాధీనం చేసుకోవడానికి భూసేనలను వినియోగించే అవకాశాన్ని కూడా ట్రంప్ సూచించినప్పటికీ, అలాంటి చర్య అమెరికా సైనికుల ప్రాణనష్టానికి దారితీస్తుందని, యుద్ధానికి తుది పరిష్కారం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ దీవిపై అమెరికా పలు దాడులు జరిపినట్లు శాటిలైట్ విశ్లేషణలు వెల్లడించాయి. వీటిలో గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, విమానాశ్రయం, హోవర్‌క్రాఫ్ట్ స్థావరాలు లక్ష్యాలుగా ఉన్నాయని ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’, ‘అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్’కు చెందిన క్రిటికల్ థ్రెట్స్ ప్రాజెక్ట్ పేర్కొంది.
ఇదే సమయంలో మంగళవారం ఉదయం ఖర్గ్ దీవిలో పలు పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అర్థ ప్రభుత్వ వార్తా సంస్థ మెహర్ నివేదించింది. మరోవైపు, టెహ్రాన్‌కు వాయువ్యంగా ఉన్న అల్బోర్జ్ ప్రావిన్స్‌పై జరిగిన వైమానిక దాడిలో కనీసం 18 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ దాడి లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. టెహ్రాన్ నగరంలో కూడా పర్వత ప్రాంతాల్లోని ఆయుధ గిడ్డంగులు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్‌పై దాడులను కొనసాగిస్తోంది. షిరాజ్‌లోని పెట్రోకెమికల్ కేంద్రాన్ని వరుసగా రెండో రోజూ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే ఇరాన్ ప్రజలు రైల్వే మార్గాలను దూరంగా ఉంచాలని ఫార్సీ భాషలో హెచ్చరికలు జారీ చేసింది.
అనంతరం రైల్వే వంతెనలు, స్టేషన్‌లు, హైవే వంతెనలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఖొర్రమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా మరో దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడులకు అమెరికా లేదా ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు. మరోవైపు, మంగళవారం ఉదయం టెహ్రాన్ నుంచి సౌదీ అరేబియాపై ఏడు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగా, వాటికి అడ్డుకట్ట వేసినప్పటికీ ఇంధన కేంద్రాల సమీపంలో అవశేషాలు పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో సౌదీ అరేబియా బహ్రెయిన్‌తో కలిపే కింగ్ ఫహద్ కాజ్ దారిని తాత్కాలికంగా మూసివేసింది.
ఇరాన్ ఇజ్రాయెల్‌పైన క్షిపణి దాడులు జరిపినట్లు, టెల్ అవీవ్, ఎయిలాట్ ప్రాంతాల్లో హెచ్చరికలు వినిపించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో 1,900 మందికిపైగా మరణించగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్‌హిజ్బుల్లా ఘర్షణల్లో 1,400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ సైన్యంలో 11 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. పరిస్థితి రోజురోజుకూ విషమంగా మారుతూ ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.