Reading Time: < 1 minute

రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు మండిపడ్డారు. నాడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అన్నారని, నేడు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు..ఇప్పుడు రైతులను కలవకుండా నిర్బంధాలు పెడుతున్నారని అన్నారు. మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న హరీష్‌రావును అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అదనపు బలగాలను తరలించారు. మధ్యాహ్నం హరీష్‌రావుతో పాటు అరెస్టు చేసిన బిఆర్‌ఎస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం దౌర్జన్యం అంటూ ధ్వజమెత్తారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బందాల పాలన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని అన్నారు. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదు అని తేల్చిచెప్పారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే తమ గొంతు నొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారెంటీలు అని ఘాటు విమర్శలు చేశారు.