Reading Time: < 1 minute

 అమరావతి: బస్సుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లి ఘటనలకు మానవ తప్పిదమే కారణం అని అన్నారు. బస్సుల్లో ప్రమాదాల నివారణపై మంత్రుల సమీక్ష ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై నిబంధనలు ఉల్లంఘించే వాటిని సీజ్ చేశామని తెలియజేశారు. 10 రోజుల్లో 10 వేల వాహనాలు తనిఖీ చేశామని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రైవేట్ ట్రావెల్స్ కు ఆదేశించామని మండిపల్లి పేర్కొన్నారు. త్వరలో బస్సు సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు చేపట్టామని, 300 కి.మీ.కు పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని సూచించారు. డ్రైవర్ల పర్యవేక్షణకు ఎఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని, స్లీపర్ బస్సులను ఎందుకు బ్యాన్ చేయకూడదనే విషయమై చర్చిస్తున్నామని అన్నారు. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని, అవసరమైతే భవిష్యత్తులో స్లీపర్ బస్సులను రద్దు చేస్తామని అన్నారు. జాతీయ, రాష్ట్ర రోడ్లపై స్పీడ్ గన్ ల ఏర్పాటుకు రూ. 40 కోట్లు కేటాయించామని, స్పీడ్ గన్ ల ఏర్పాటు కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.