Reading Time: < 1 minute

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని.. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకొని, అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు బిఆర్‌ఎస్‌ నేతలతో కలిసి హరీష్ రావు పరిగి వెళ్తుండగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కొద్దిసేపటిక్రితం వారిని స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని ఫైరయ్యారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి కూడా వెళ్లనివ్వడం లేదని.. రాష్ట్రంలో ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి నువ్వు మళ్లీ గెలుస్తా అనేది పగటి కల.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది రామ రాజ్యం, కెసిఆర్ రాజ్యం” అని హరీష్ రావు అన్నారు.