Reading Time: 2 minutes

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ బీభత్సం ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మందికి కావలసిన ఆహారం, ఔషధాలు అందకుండా చేస్తోంది. ఈ యుద్ధం జూన్ వరకు కొనసాగితే ప్రపంచం మొత్తం మీద 320 మిలియన్ మంది ఆకలి జ్వాలలతో దహించుకు పోవలసి వస్తుందని ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయక సంస్థ ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ (డబ్లుఎఫ్‌పి) ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మార్గాలకు తీవ్ర ఆటంకం ఎదురుకావడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం రానురాను పెరుగుతోంది. దుబాయ్, దోహా, అబుధాబి వంటి వ్యూహాత్మక కేంద్రాలనుంచి నౌకా రవాణా మార్గాలు పూర్తిగా మూసుకు పోయాయి. ఇంధనం, బీమా రేట్లు విపరీతంగా పెరగడంతో దానికి తగ్గట్టు రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇదే ఖర్చులతో అతి తక్కువగా సరఫరా చేయవలసి వస్తోంది. వేలాది టన్నుల ఆహార పదార్ధాలు చాలా ఆలస్యంగా రవాణా అవుతున్నాయి. యుద్ధ బాధిత సూడాన్‌కు 130,000 డాలర్ల విలువైన ఔషధాలు పంపవలసి ఉండగా దుబాయ్‌లో స్తంభించిపోయాయని, అలాగే సోమాలియాలో పోషకాహార లేమితో బాధపడుతున్న పిల్లలకు అందవలసిన పౌష్టికాహార 670 బాక్సులు భారత్‌లో చిక్కుకుపోయినట్టు ఇంటర్నేషనల్ రిస్కు కమిటీ వెల్లడించింది.

16 దేశాలకు కావలసినవి సమకూర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి వివరించింది. విదేశీ సహాయ నిధుల్లో అమెరికా విధించిన భారీ కోతలు ఇప్పటికే అనేక సహాయక బృందాలను బలహీనపర్చగా, యుద్ధంవల్ల ఈ సమస్య మరింత తీవ్రమైందని ఆందోళన వెలిబుచ్చింది. కొవిడ్ మహమ్మారి తరువాత సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఎదురుకావడం ఇదేనని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. నౌకా రవాణా వ్యయం పెరిగిపోవడమే కాదు, వేరే మార్గాల ద్వారా సరఫరా చేయవలసి వస్తోందని పేర్కొంది. యుద్ధంవల్ల కొన్నిలక్షల మంది నిర్వాసితులైన ఇరాన్, లెబనాన్‌ల్లో కొత్తగా అత్యవసర పరిస్థితులు తలెత్తుతున్నాయి. మానవతా సహాయం అందలేని పరిస్థితి ఏర్పడుతోంది. యుద్ధం ఆగినా సరే ప్రపంచ వ్యాప్తంగా సరఫరాపై యుద్ధ ప్రకంపనలు ప్రభావం చూపిస్తాయి. హర్మూజ్, సూయెజ్ కెనాల్ మార్గాలకు ప్రత్యామ్నాయంగా వేరే రవాణా మార్గాలను వెతుక్కోవలసి వస్తోంది.

ఆఫ్రికా చుట్టూ నౌకలద్వారా సహాయాలను పంపిస్తున్నారు. దాంతో గమ్యం చేరడానికి కొన్ని వారాలు పడుతున్నాయి. ఇరాన్, నైజీరియాలకు సకాలంలో వ్యాక్సిన్లు పంపించడానికి వివిధ రవాణా మార్గాలు అనుసరించడంతో రవాణా ఖర్చుల భారం పెరుగుతోంది. యుద్ధానికి ముందు యునిసెఫ్ వ్యాక్సిన్లను నేరుగా విమానం ద్వారా ఇరాన్‌కు పంపేది. ఇప్పుడు అలా కాకుండా విమానాల ద్వారా టర్కీకి పంపి, అక్కడ నుంచి ఇరాన్‌కు చేర్చడమవుతోంది. దీంతో అదనంగా 20 శాతం రవాణా ఛార్జీలు భరించక తప్పడమేకాక, ఆలస్యంగా చేరుతున్నాయి. సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్ అనే సేవాసంస్థ దుబాయ్ నుంచి సూడాన్ రేవుకు నౌకల ద్వారా సరఫరాలు పంపించేది. ఇప్పుడు దుబాయ్‌నుంచి సౌదీ అరేబియా మీదుగా అక్కడ నుంచి ఎర్రసముద్రం ద్వారా అత్యవసర సరకులు పంపిస్తోంది. దీంతో 25 శాతం రవాణా ఖర్చులు అదనంగా పెరగడంతోపాటు పది రోజులు దాటితేనే కానీ చేరడం లేదు. ఈలోగా సూడాన్ ప్రజలు 19 మిలియన్ మంది తీవ్ర ఆహార సంక్షోభానికి గురి కావలసి వస్తోంది.

ఈ ఆలస్యం సూడాన్ లోని 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై పడుతోంది. అత్యవసర మందులు లేక అల్లాడుతున్నాయి. చివరికి సరఫరాలో ప్రాధాన్యతలు ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. సహాయం కావలసిన పిల్లల సంఖ్యనైనా తగ్గించుకోవాలి. లేదా అందించగలిగే వస్తువుల సంఖ్యనైనా తగ్గించుకోవాలన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇంధనం ధరలు పెరగడంతో ఆహారం ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో సరఫరా కాక సోమాలియాలో 6.5 మిలియన్ మంది తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు. వీరి భద్రత గాలిలో దీపంలా తయారైంది. నైజీరియాలో ఇంధనం ధరలు సగానికి సగం పెరగడంతో ఆస్పత్రులకు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి జనరేటర్లపై ఆధారపడక తప్పడం లేదు. మొబైల్ హెల్త్ టీమ్‌లు తమ సేవలను తగ్గించుకుంటున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఆకలి బతుకులపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపించడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే ఎరువుల్లో 30 శాతం హర్మూజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతుండడం పరిపాటిగా వస్తోంది. ఈ ఎరువులు తూర్పు ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయ పనులకే ఆధారం. కానీ పేదదేశాల్లోని సన్నకారు రైతులు ఇప్పుడు ఎరువుల కోసం నిరీక్షిస్తున్నారు. సూడాన్ తనకు కావలసిన ఎరువుల్లో దాదాపు సగానికి ఎక్కువగానే గల్ఫ్, కెన్యా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీన్ని గమనించి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎరువుల సరఫరా పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. గతంలో అవలంబించిన ‘బ్లాక్‌సీ గ్రెయిన్ ఇనిషీయేటివ్’ అనే ఒప్పందం ద్వారా నల్లసముద్రం మీదుగా ఎరువులు, ఇతర నిత్యావసరాలు రవాణా అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి యుద్ధం ఎంత బీభత్సంగా ఉన్నా అంతర్జాతీయ సమాజం నిత్యావసరాలు, ఔషధాలు వంటివి సరఫరా చేయడానికి, పేద దేశాలకు మానవతా సాయం అందించడానికి అంతగా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.