Reading Time: < 1 minute

హైదరాబాద్: ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే సూర్యడి చుట్టూ భూమి తిరిగినట్టు, రేవంత్ రెడ్డి ఆలోచనలు భూముల చుట్టు తిరుగుతున్నాయని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. మమ్మలి అరెస్టు చేసి అడ్డుకున్న కూడా పరిగికి వెళ్లి భూములు కోల్పోతున్న ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. హెచ్ సియు యూనివర్సిటీ భూములు, నాదర్ గుల్ భూములు, కోహెడ మార్కెట్, లగచర్ల భూముల కథలను చూశామని దుయ్యబట్టారు. ఇప్పుడు పరిగిలో భూములను లాక్కుంటున్నారని, ప్రజలు పాలన చేయమని గద్దెనెక్కిస్తే ఎందుకు భూములను లాక్కుంటున్నారని ప్రశ్నించారు. ఎస్‌టి, ఎస్‌సిలకు భూములకు సమానమైన నష్ట పరిహారం ఇస్తామన్నారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట మాట్లాడారని, అధికారం వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్నారని, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని మండపడ్డారు.