Reading Time: < 1 minute

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అవమానంతో భార్యను హత్య చేశాడు ఓ భర్త. సిద్ధారెడ్డి, కవిత ఇద్దరు భార్యాభర్తలు. మార్చి 27న జహీరాబాద్ లో ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది కవిత(29). మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సిద్దారెడ్డి. ఈ క్రమంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జడ్చరల్లో కవిత ప్రియుడు పవన్‌తో ఉన్నట్టు గుర్తించారు. కవితను జహీరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులతో పాటు భర్త సిద్ధారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నాడు. అవమానంతో రగిలిపోయిన సిద్ధారెడ్డి అక్కడే ఓ కత్తి కొనుగోలు చేశాడు.

తన భార్య అయిన కవితను తీసుకొస్తుండగా.. పోలీసులు ఉండగానే కారులో సదాశివపేట (మం) నందికంది వద్దకు రాగానే కత్తితో కవిత గొంతులో పొడిచి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో కవిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కవిత మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు ముందుభాగంలో పోలీసు కూర్చండగానే సిద్ధారెడ్డి కవితను హతమార్చటం చర్చనీయాంశమవుతున్నది.