Reading Time: < 1 minute

ఆర్టెమిస్2 చంద్రయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నలుగురు వ్యోమగాములు ‘ఒరాయన్ ’వ్యోమనౌకలో చంద్రుడి గురుత్వాకర్షణ పరిధి లోకి ప్రవేశించారు. ప్రత్యేకంగా తయారు చేసిన నాలుగు అద్దాల కిటికీల్లోంచి బయటికి అంతరిక్షం లోకి తొంగి చూస్తుంటే చంద్రుడు మెలమెల్లగా చేరువవుతున్నట్టు, భూమి దూరంగా జరిగిపోతున్నట్టు వీరికి కనిపిస్తోంది. వ్యోమగాములు జాబిల్లిని చేరుకునే క్రమంలో మూడింట రెండొంతుల ప్రయాణం పూర్తయింది. వీరిని తీసుకెళ్లిన ఒరాయన్ వ్యోమనౌక 4,06,773 కి.మీ దూరం ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్షయాత్రగా రికార్డు సృష్టించింది.

నలుగురు వ్యోమగాములు సోమవారం రాత్రి 23.47 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువ జామున 4.17 గంటలకు చంద్రుడి వెనుక వైపునకు వెళ్తారు. గతంలో 1970లో అపోలో 13 ప్రయాణించిన దూరం కంటే ఇది 2500 కిమీ అదనం కావడం గమనార్హం. ఈ క్రమంలోనే “లూనార్ ఫ్లైబై” దశ చోటు చేసుకోనుంది. ఆ విన్యాసంతో ఒరాయన్, చందమామను దాటి 6400 కిమీ దూరం వెళుతుంది. ఈ సమయంలో మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి రెండో పార్శాన్ని వ్యోమగాములు క్లిక్‌మనిపిస్తారు. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేశాక ఈ వ్యోమనౌక భూమి వైపు మళ్లుతుంది. ఈనెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ ఉండవచ్చు.