
చండీగఢ్: పంజాబ్ లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో లింక్ ఉన్న ఓ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఛేదించింది. ఈ ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రెండు హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
పట్టుబడిన గ్రెనేడ్లపై పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (పీఓఎఫ్) గుర్తులు ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ చెప్పారు. అరెస్టు అయిన వారిని తార్న్ తారన్‌లోని అమ్మిషా గ్రామానికి చెందిన సరబ్‌జిత్ సింగ్, అమృత్‌సర్‌లోని నంగల్ పన్నువాన్ గ్రామానికి చెందిన బిక్రమ్‌జిత్ సింగ్, అమృత్‌సర్‌లోని ఇంద్ర కాలనీకి చెందిన అమన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.
పోలీసుల ప్రకారం.. ఐఎస్ఐతో సంబంధమున్న ఈ ముఠా పలు రాష్ట్రాల్లోని పోలీసు సంస్థలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మూఠాలోని మిగత వారిని గుర్తించి, వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.