Reading Time: 2 minutes

 తమిళనాడులోని మధురై కోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు వెల్లడించింది. తూత్తుకుడి జిల్లా సాతన్‌కుళంకు చెందిన తండ్రీ కొడుకుల లాకప్‌డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అత్యంత దారుణంగా అధికారాన్ని అతిక్రమించి క్రూరమైన నేరానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా నిందితులను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఆరేళ్ల సుదీర్ఘ విచారణ, వాదనల అనంతరం జడ్జి ముత్తుకుమరన్ తీర్పు వెలువరించారు. 10 మంది నిందితులకు గాను ఒకరు విచారణ క్రమంలోనే మరణించారు. మిగతా తొమ్మిది మందికి ఈ శిక్షను వర్తింప చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పౌరులు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలతో పాటు తదితర రంగాలకు కొన్ని నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.

2020 సంవత్సరం జూన్ 19న నిర్ణీత సమయానికి మించి మొబైల్ షాపును తెరిచి ఉంచారని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై యజమాని జయరాజ్(59), అతని కుమారుడు బెనిక్స్(31)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కస్టడీలో వారిని తీవ్రంగా హింసించడంతో వారిద్దరూ సబ్‌జైలులో రెండు రోజుల వ్యవధిలో మరణించారు. పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే దెబ్బలకు తాళలేక చనిపోయారని విచారణ నివేదికలు బహిర్గతం చేశాయి. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుల్లో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌లు రఘు గణేశ్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు మురుగన్, సమదురై, కానిస్టేబుళ్లు ముత్తురాజ్, చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలిముత్తు ఉన్నారు. పదో నిందితుడైన ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై కొవిడ్ సోకి చికిత్స పొందుతూ విచారణ దశలోనే మరణించాడు.

దర్యాప్తు రికార్డు ఏం చెబుతుంది..?

బాధితుల శరీరాలపై 18 అత్యంత తీవ్రమైన గాయాలున్నాయని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నివేదిక వెల్లడించింది. కస్టోడియల్ విచారణ సందర్భంగా పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక బెనిక్స్ గాయాలతో మరణించాడని పోస్ట్‌మార్టమ్ నివేదిక చెబుతోంది. తండ్రీ కొడుకులపై పోలీసుల దాష్టీకం గంటల పాటు నిరంతరంగా సాగిందని, వాళ్ల బట్టలు విప్పించి, లోదుస్తులపై ఉంచి అత్యంత క్రూరంగా హింసించినట్లు చార్జిషీట్‌లో తెలిపారు. చెక్కబల్లపై ఒకరి తర్వాత ఒకరిని పడుకోబెట్టి చేతులు, కాళ్లను నిందితులైన పోలీసులు గట్టిగి వంకరలు తిప్పి పట్టుకొని ఉండగా మరికొందరు లాఠీలతో వాళ్ల శరీరాలపై ఇష్టం వచ్చిన చోట విరుచుకుపడ్డట్లు పేర్కొన్నారు.

రక్తం మరకలతో తడిసిముద్దయిన వాళ్ల దుస్తులను పలుమార్లు మార్పించారని, అంతటితో వారి క్రూరమైన చర్యలు ఆగలేదని.. నేలపై పారుతున్న వాళ్ల రక్తాన్ని వాళ్లతోనే ఎత్తి శుభ్రం చేయించారని కూడా చార్జిషీట్‌లో పొందుపరిచారు. దాడి తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని, తండ్రీ కొడుకులపై తప్పుడు కేసు కూడా మోపారని వివరించారు. జూన్ 22, 23 తేదీల్లో జయరాజ్, బెనిక్స్ కొవిల్‌పట్టి సబ్‌జైలులో మరణించారని, ఇది ప్రజాగ్రహానికి దారితీసిందని పేర్కొన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున అప్పట్లో ఆందోళనలు వెల్లువెత్తాయి.

సిబిఐ రిపోర్టులో ఏముంది?

అంతకుముందు కేసు విచారణ జరిపిన సిబిఐ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌కు నివేదిక సమర్పించింది. బాధితుల డిఎన్‌ఎ శాంపిళ్లు సేకరించడంతో పాటు పోలీస్ స్టేషన్ లాకప్ గోడలు, టాయిలెట్లు, ఎస్‌హెచ్‌ఓ గది, లాఠీల నుంచి సేకరించిన శాంపిళ్లు పరీక్షించి చూస్తే రెండూ మ్యాచ్ అయినట్లు తెలిపింది. జూన్ 19న రాత్రి 7.30గంటలకు జయరాజ్‌ను కామరాజ్ చౌక్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించగా.. వారిని అతని కుమారుడు అనుసరించగా ఇద్దరినీ నిర్బంధించారని వివరించింది. తనకు బిపి, డయాబెటిస్ తదితర వ్యాధులున్నాయని, దయచేసి కొట్టవద్దని జయరాజ్ ఎంత వేడుకున్నా నిందితులు వదిలిపెట్టలేదని, బెనిక్స్‌కు పలు చోట్ల అత్యంత తీవ్రమైన గాయాలయ్యాయని సిబిఐ తెలిపింది. ఈ హింస పోలీసుల జవాబుదారీతనంపై దేశవ్యాప్తంగా సామాన్యుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని, నిందితులను కఠినంగా శిక్షించాల్సి అవసరాన్ని సిబిఐ ఈ సందర్భంగా కోరింది.