Reading Time: < 1 minute

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ నిర్వాహకులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం దక్కింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్‌లో ఏప్రిల్ 17న ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో ’ఇగ్నైటింగ్ మైండ్స్’ నిరంతర కృషి చేస్తున్నది. ముఖ్యంగా సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘హరా హై తో భరా హై‘ (ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు) నినాదంతో ముందుకొచ్చిన ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ దేశవ్యాప్తంగా పర్యావరణ బాధ్యతను ఒక సత్సంప్రదాయంగా మార్చింది. విద్యార్థులు, యువత, రైతులు, సామాన్యుల నుంచి జాతీయ స్థాయి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ఉద్యమంలో భాగస్వాములై మిలియన్ల కొద్దీ మొక్కలు నాటారు.

లండన్‌లో వేడుక

పర్యావరణ పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై పోరాడుతున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించి వారికి పురస్కారాలు అంది స్తున్న బ్రిటన్ సంస్థ హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్ ఏప్రిల్ 17న అంతర్జాతీయ కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లారడ్స్ లో సంతోష్ కుమార్ కు ’గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ పురస్కారాన్ని అందజేస్తారు.

సమిష్టి కృషికి దక్కిన గౌరవమిది

ఈ గౌరవం పట్ల జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన ఒక్కడికి దక్కిన గౌరవం కాదని, పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపుపై ’ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్’ స్పందిస్తూ డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఆదర్శాలతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి భావితరాలకు పచ్చని భూమిని అందించడమే తమప్రధాన లక్ష్యమని పేర్కొన్నది.