
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ సిఎం పెమా ఖండు ఫ్యామిలీ కాంట్రాక్టులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఎం పేమా ఖండూ కుటుంబం పదేళ్లలో రూ.1,270 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించింది. రెండు వారాల్లోగా దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే, కాంట్రాక్టుల కేటాయింపునకు సంబంధించిన అన్ని పత్రాలను ఏజెన్సీకి సమర్పించాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 16 వారాల్లోగా దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
“సీబీఐ రెండు వారాల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలి. ప్రాథమిక విచారణ, తదుపరి దర్యాప్తు.. ఏవైనా ఉంటే, జనవరి 1, 2015 నుండి డిసెంబర్ 31, 2025 మధ్య కాలంలో జరిగిన ప్రభుత్వ పనుల అమలు, కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్‌లను పరిశీలించాలి. ప్రభుత్వం, సీబీఐకి పూర్తి సహకారం అందించాలి. సీబీఐతో సమన్వయం కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక నోడల్ అధికారిని నియమించాలి. ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా రాష్ట్రం చూసుకోవాలి” అని ఉత్తర్వులో పేర్కొంది. సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్, వాలంటరీ అరుణాచల్ సేన అనే సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.